కొవిడ్ రోగులు, వారికి సేవలందిస్తున్నవారికి ఉపయోగపడే 7.79 కోట్ల ఉత్పత్తుల కోసం విశాఖలోని వీసెజ్‌లో ఉన్న 8 పరిశ్రమలు అనుమతులు పొందాయి. అంతర్జాతీయ అవసరాల దృష్ట్యా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఆ సంస్థలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చింది. ఈ పరిశ్రమలు మాస్కులు, పీపీఈ కిట్లు, సర్జికల్ మాస్కులు, షూ కవర్లు, ఫేస్ ఫీల్డులు ఉత్పత్తి చేయనున్నాయి. దేశీయ అవసరాలకు ఎలాంటి కొరత రాకుండా ఉండేందుకు వీసెజ్ ఉన్నతాధికారులు శరవేగంగా అనుమతులు మంజూరు చేశారు.
● సర్జికల్ మాస్క్‌లు, పీపీఈ కిట్ల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఫేస్ షీల్డులను ‘ఆంక్షలతో కూడిన అనుమతుల కేటగిరీ’లో ఉంచింది. వీటిని ఎగుమతి చేయాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి.
● ప్రస్తుతం డిమాండ్‌ను పరిశీలించిన కొన్ని సంస్థలు నాసిరకం ఉత్పత్తులను మార్కెట్లోకి వదులుతున్నాయి. వీసెజ్‌లోని సంస్థలు వాటితో పోటీపడలేక, నాణ్యత విషయంలో రాజీ పడలేక, ఆంక్షల కారణంగా ఎగుమతులు చేయలేక కొన్ని ఇబ్బందులు పడుతున్నాయి. ఇవి ఇప్పటికే 3.19 లక్షల ఉత్పత్తులను వివిధ సంస్థలకు విక్రయించగా, ఇంకా 6.98 లక్షల ఉత్పత్తుల స్టాకు మిగిలిపోయింది.
అత్యంత వేగంగా అనుమతులిచ్చాం
'ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్నందున ప్రజలకు, రోగులకు, వారికి సేవలందిస్తున్న వారికి ఉత్పత్తుల పరంగా కొరత రాకూడదన్న ఉద్దేశంతో తయారీ సంస్థలకు అత్యంత వేగంగా ఆన్‌లైన్లోనే అనుమతులు మంజూరు చేశాం. ఆయా సంస్థలు యుద్ధప్రాతిపదికన పలు ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. భవిష్యత్తులో ఎలాంటి కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. మొత్తం 8 సంస్థలు ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.' -- ఎ.రామమోహన్‌రెడ్డి, అభివృద్ధి కమిషనర్, వీసెజ్, విశాఖపట్నం
వీసెజ్ పరిధిలో కొవిడ్ ఆధారిత ఉత్పత్తులు చేస్తున్న సంస్థలు: 8
వాటి ఉత్పత్తి సామర్థ్యం: 7.79 కోట్లు
ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైన ఉద్యోగులు: 1570 మంది
ఇవీ చదవండి..