Bail to Auditor Sravan: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలను పరిశీలించే బ్రహ్మయ్య అండ్ కొ అధికార ఆడిటర్ కుదరవల్లి శ్రావణ్‌కు విశాఖ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.తిరుమలరావు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆయన్ను రాష్ట్ర సీఐడీ పోలీసులు ఈ నెల 11న అరెస్టు చేశారు. నిందితుని తరపున సీనియర్ న్యాయవాదులు ఎం.రవి, టి.సత్యశ్రీకాంత్ ఈ నెల 12న విశాఖ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తిరుమలరావు శ్రావణ్‌కు బెయిల్ మంజూరు చేశారు.
రూ.25 వేల విలువైన వ్యక్తిగత పూచీకత్తు, అంతే విలువ కలిగిన రెండు ష్యూరిటీలను న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించారు. శ్రావణ్ ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సీఐడీ కార్యాలయంలో విధిగా హాజరుకావాలని.. సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేయకూడదని, దర్యాప్తు అధికారులకు సహకరించాలని ఆదేశించారు. నిందితుడు షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోరుతూ దర్యాప్తు అధికారులు పిటిషన్ వేయొచ్చని న్యాయమూర్తి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై తీర్పు రిజర్వు: విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు.. శ్రావణ్‌కు రిమాండ్ విధించే అధికారం లేదంటూ ఆయన భార్య డాక్టర్ నర్మద దాఖలు చేసిన పిటిషన్‌లో సీఐడీ న్యాయవాది అభ్యర్థన మేరకు హైకోర్టు బుధవారం మరోసారి విచారణ జరిపింది. సీఐడీ తరఫు న్యాయవాది శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. శ్రావణ్‌ను పీటీ వారంట్‌పై విశాఖకు తీసుకెళ్లాక బెయిలు కోసం అక్కడి కోర్టులో పిటిషన్ వేశారన్నారు. నర్మద తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు శ్రావణ్‌కు రిమాండ్ విధించే అధికారం లేదనేది తమ ప్రధాన వాదన అన్నారు. రిమాండ్ తదనంతర పరిణామాలు చట్టవిరుద్ధం అవుతాయన్నారు.
విశాఖ కోర్టులో దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌కు.. రిమాండ్ విధింపును సవాలు చేస్తూ వేసిన ఈ పిటిషన్‌కు సంబంధం లేదన్నారు. పీటీ వారంట్‌పై వివిధ ప్రాంతాలకు తిప్పుతారనే ఆందోళనతో మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని కోరామన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై తీర్పును రిజర్వు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ వి.శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో చార్టర్డ్ అకౌంటెంట్ అయిన తన భర్త కుదరవల్లి శ్రావణ్‌ను జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపే అధికారం విజయవాడ మూడో ఏసీఎంఎం కోర్టుకు లేదంటూ ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. బెయిలుపై మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై తీర్పును రిజర్వు చేసింది.
ఇవీ చదవండి: