ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా రూపొందిన అటల్ టన్నెల్ నిర్మాణంలో విశాఖ ఉక్కును భారీగా వినియోగించారు. పది వేల అడుగుల ఎత్తున అతి ఎత్తైన హైవే టన్నెల్‌ను భారత్ సమర్ధంగా పూర్తి చేయగలిగింది. అక్టోబర్ మొదటి వారంలోనే టన్నెల్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
టన్నెల్ వల్ల ఆ సమస్య తీరింది..
సుమారు 9.02 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ మనాలీ నుంచి లాహవుల్ వేలీ వరకు ఏడాది పొడవునా నిరంతరాయ మార్గంగా ఉండేలా నిర్మించారు. పెద్ద ఎత్తున మంచు కురవడం వల్ల ఏడాదిలో ఆరు మాసాల వరకు ఈ మార్గం మూసుకుపోయేది. ఇప్పుడు ఆ సమస్య టన్నెల్ నిర్మాణం వల్ల తీరింది. మనాలీ నుంచి లెహ్ వరకు ఉన్న 46 కిమీ మేర రహదారి మార్గం తగ్గినట్టయింది.
విశాఖ సీఎండీ హర్షం..
ఈ రకం ఉక్కు సరఫరా చేసిన సంస్ధల్లోకెల్లా విశాఖ ఉక్కు అగ్రస్ధానంలో ఉండటం పట్ల ఉక్కు సీఎండీ పికే రథ్ హర్షం వ్యక్తం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద జాతీయ ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామం కావడంపై విశాఖ ఉక్కు సంస్ధ కార్మిక లోకం సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. గతంలోనూ పలు జాతీయ ప్రాజెక్టుల్లో విశాఖ ఉక్కు ఉత్పత్తులను విరివిగా వినియోగించారు.
కరోనా కారణంగా..
ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారాలే చాలా వరకు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 7.2 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి చేరువలో ఉన్న విశాఖ ఉక్కు.. కొవిడ్ కారణంగా మార్కెటింగ్, ఉత్పత్తిలో అవాంతరాలు ఎదుర్కొంది. ప్రస్తుతం వాటిని అధిగమిస్తూ ఈసారి జాతీయ ప్రాజెక్టుకు అవసరమైన టీఎంటీ బార్లను సరఫరా చేసి పేరును నిలబెట్టుకోగలిగింది.