SKATING: సర్రుమని బోర్డుపై వేగంగా జారుతూ.. మళ్లీ వెంటనే ఒక్కసారిగా పక్కకు తిరుగుతూ.. వెను వెంటనే జంపింగ్స్ చేస్తూ పాదరసంలా జారిపోయే క్రీడే.. స్కేటింగ్. ఇదో వైవిధ్యమైన స్పోర్ట్. చూసే వాళ్లకు ఎంత వింతగా ఉంటుందో.. ప్రదర్శించే వాళ్లకు అంతే కష్టంగా కూడా ఉంటుంది. రోలర్ స్కేటింగ్, ఫిగర్ స్కేటింగ్.. ఈ రెండు ఫ్లోర్‌పై చేసేదే. దీనిలో ఈ యువ స్కేటర్లు ప్రస్తుతం వారి ప్రతిభను చాటుతున్నారు.
విశాఖకు చెందిన అన్మిష ఐదేళ్ల నుంచే స్కేటింగ్ సాధన మొదలుపెట్టింది. ప్రస్తుతం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బీటెక్ చదువుతున్న ఈ యువతి స్కేటింగ్ కోసం రోజుకు అరు నుంచి ఏడు గంటల పాటు సాధన చేస్తోంది. స్కేటింగ్‌లో వివిధ విభాగాలు ఉంటాయి. స్పీడ్, ఆర్టిస్టిక్, రోలర్‌తో సహా 10రకాలుంటాయి. అన్మిష తనకెంతో ఇష్టమైన రోలర్ స్కేటింగ్‌లో ప్రతిభ కనబరుస్తోంది. ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని మెడల్స్ సాధించడమే తన లక్ష్యమంటోంది.
ఎంతో కష్టమైన స్కేటింగ్‌లో నిరంతర సాధనతోనే విజయం లభిస్తుంది. అందుకే మంచి కోచింగ్ ఎంతో అవసరం. ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నా.. ఎప్పుటికప్పుడు కొత్త టెక్నిక్స్ అనేవి చాలా అవసరం. అలా కోచ్ అందించే సూచనలు పాటించడం వల్లే అంతర్జాతీయ వేదికలపై తమకు పతకాలు లభిస్తున్నాయి -యువ స్కేటర్లు
విశాఖకే చెందిన మరో యువ స్కేటర్ హరికమల్. ఇతడు కూడా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోనే బీటెక్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే స్కేటింగ్ సాధన చేస్తున్న కమల్. తనకెంతో ఇష్టమైన ఫిగర్ స్కేటింగ్, సోలో డ్యాన్స్‌లో రాణిస్తున్నాడు.
భారత్‌లో స్కేటర్లు సాధన చేసే రింక్‌కు విదేశాల్లో పోటీలో పాల్గొనే రింక్‌లకు చాలా తేడాలు ఉంటాయి. దీనివల్ల అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతాయి. అలాంటి సమయంలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే తమకి వీటితో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కమల్ చెబుతున్నాడు. కమల్ ఇప్పటికే జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో ఎన్నోసార్లు గోల్డ్‌మెడల్స్ సాధించాడు. కానీ, తనకు ఏషియాన్ ఛాంపియన్‌షిప్‌లో వచ్చిన మెడల్ ఎంతో ప్రత్యేకమైంది అంటున్నాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఇటీవలే ఈ గేమ్‌ను చేర్చారు. దీంతో రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యమంటున్నాడు కమల్.
అన్మిష, కమల్ ఇద్దరూ ఒక్క దగ్గరే కోచింగ్ తీసుకుంటున్నారు. చదువులకు ఇబ్బందులు లేకుండా వారి కోచ్ సింహాద్రి ప్రత్యేక ప్రణాళిక చేశాడు. గత నాలుగేళ్లుగా కోచింగ్ తీసుకుంటున్న వీళ్లు మెుదటిసారే అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకరావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్కేటింగ్‌లో భారత్‌కు మరిన్ని పతకాలు తీసుకొస్తామని చెబుతున్నారు ఈ యువ స్కేటర్లు.
ఇవీ చదవండి: