విశాఖ నగరంలో మొత్తం పోలైన ఓట్లు - 10,24,802 కాగా..వైకాపా - 4,29,802 (41.94), తెదేపా - 3,58,367 (34.97), జనసేన - 76,407 (7.46), భాజపా - 32,740 (3.20), కాంగ్రెస్ - 6,271 (0.61), సీపీఐ - 3,198 (0.31), సీపీఎం - 8,621 (0.84), స్వతంత్రులు, మురిగిపోయిన ఓట్లు - 99,655 (9.72), నోటా - 9,741 (0.95) శాతంగా నమోదయ్యాయి.
కేవలం 7శాతంలోపు ఓట్లు మాత్రమే తేడా..
వార్డులవారీగా ఆయా పార్టీల అభ్యర్థులు దక్కించుకున్న ఓట్లను నియోజకవర్గాల వారీగా కలిపి చూస్తే.. వైకాపా, తెదేపా మధ్య నగరవ్యాప్తంగా కేవలం 7శాతంలోపు ఓట్లు మాత్రమే తేడా ఉంది. కానీ కొన్ని వార్డుల్లో వైకాపా స్వల్ప మెజారిటీలతో గెలుపును కైవసం చేసుకుంది. కీలక సమయాల్లో తెదేపా ప్రభావం చూపలేకపోవడంతో 30 సీట్లలో రెండో స్థానంలో ఉండిపోయింది. కీలకపార్టీ తెదేపా వెనకడుగు వేయడంతో ‘ఫ్యాను’కు తిరుగులేకుండాపోయింది.
నోటా కన్నా తక్కువ ఓట్లు పోలైన పార్టీలు...
నోటా కన్నా తక్కువ ఓట్లను కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు పొందాయి. కానీ సీపీఐ, సీపీఎం కార్పొరేటర్లుగా ఖాతా తెరవగా.. కాంగ్రెస్ మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపని పార్టీగా మారింది. వైకాపా, తెదేపా మినహా మిగిలిన పార్టీలు కేవలం 12.42 శాతం ఓట్లనే సాధించుకోగలిగాయి. వీరికన్నా స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ ప్రభావాన్ని చూపారని చెప్పాలి.
మంత్రి నియోజకవర్గంలోనూ వైకాపాకు ఎదురుగాలి..
నియోజకవర్గాల్లో పార్టీల అధిపత్యం చూస్తే.. వైకాపా ఏకంగా 6 నియోజకవర్గాల్లో పైచేయి సాధించింది. తూర్పు, దక్షిణం, ఉత్తరం, పశ్చిమ, గాజువాక, అనకాపల్లి నియోజకవర్గాల్లో పోటీచేసిన వైకాపా కార్పొరేట్ అభ్యర్థులు పార్టీ బలాన్ని పెంచేలా ఓట్లను సాధించగలిగారు. ఉత్తర నియోజకవర్గంలో చూస్తే.. తెదేపా ఓట్లతో పోల్చితే వైకాపా సుమారు 42శాతం అధిక ఓట్లను రాబట్టుకోగలిగింది. తెదేపా ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో ‘ఫ్యాన్’ ప్రతాపం చూపింది. అయితే కీలకమైన భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో తెదేపా ఎక్కువ ఓట్లను దక్కించుకోగలిగింది. వైకాపా ఓట్లతో పోల్చితే తెదేపా.. పెందుర్తిలో అదనంగా 16.08శాతం ఓట్లను, భీమిలిలో సుమారు 12శాతం ఓట్లను తమవైపునకు తిప్పుకోగలిగింది. మంత్రి నియోజకవర్గంలోనూ వైకాపాకు ఎదురుగాలి వీయడంపై ఇప్పుడంతా చర్చనీయాంశంగా మారింది.
‘ఓట్ల’లో.. ఏది నిజం..
ఈనెల 10న జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 59.41శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 10,24,802 ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తిచూపినట్లు ప్రకటించారు. కానీ లెక్కింపు పూర్తయ్యాక.. ఈ ఓట్లు కాస్తా 10,25,758గా మారాయి. పోలింగ్‌లో ఓట్లకు మించి లెక్కింపులో ఓట్లు ఎలా పెరిగాయి? అని ఇప్పుడు చర్చ నడుస్తోంది. లెక్కింపు పూర్తయ్యాక మురుగుపోయిన ఓట్లు 23,458గా ఉన్నట్లు అధికారులు తేల్చారు. కొన్ని వార్డులకు ప్రకటించిన ఓట్లలో పోలింగ్ రోజున పడ్డ ఓట్లకన్నా లెక్కింపులో ఓట్లు తగ్గాయి. అధికారులు సమర్పించిన లెక్కల్లో తేడాలు కనిపించాయి.
ఇవీ చూడండి...