తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని నైస్ మెరైన్ ఎక్సోపోర్ట్స్ డైరెక్టర్ సరిక వెంకటేశ్వరరావు, తనఖాదారుడు ఎం.శ్రీనివాస్‌లపై విశాఖ సీబీఐ కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంకుకు చెల్లించాల్సిన 9 కోట్ల 39 లక్షల రూపాయిల పైచిలుకు మొత్తాన్ని 2017 నుంచి చెల్లించడం లేదని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. తీసుకున్న రుణాన్ని ఎగవేసేందుకు కొందరు బ్యాంకు సిబ్బందితో కలిసి యత్నించారని బ్యాంకు డీజీఎం చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
రూ. 9.39కోట్ల రుణ పొందేందుకు అడ్డదారులు
రొయ్యల ఎగుమతి కార్యకలాపాలను నిర్వహించే నైస్ మెరైన్ ఎక్సోఫోర్ట్స్ పేరిట వివిధ రుణపరిమితుల కింద ఐదు కోట్లు, మూడు కోట్లు, రెండు కోట్ల మొత్తాలను వినియోగించుకునేందుకు బ్యాంకు మంజూరు చేసింది. వీటికి హామీగా తొలుత హైదరాబాద్‌లోని మాతృభూమి పెరల్స్‌లోని 25 ఫ్లాట్లను చూపారు. తర్వాత ఎం. శ్రీనివాస్ పేరిట హైదరాబాద్‌లో ఉన్న 3వేల గజాలను భూమిని ఈ రుణమొత్తానికి హామీగా మార్చారు. మొమోరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ (ఎంఓడీటీడీ)ను సృష్టించారు. విశాఖలోని కంచరపాలెం కెనరా బ్యాంకు శాఖ మేనేజర్ పీబీ సీతారామయ్య.. ఈ రుణాలకు కావాల్సిన అంశాలను పరిశీలించి మంజూరు చేయించారు. తనఖాదారుడు ఎం. శ్రీనివాస్ అస్తి హక్కును పరిశీలించకుండా, ఆయన అనుమతి తీసుకోకుండా, ఆ ఆస్తి ఈ రుణ హామీకి సరిపడదన్న అంశం తెలిసి రుణం కోసం తనఖాగా ఆ భూమిని ఆమోదించి ఫైల్ నడిపి మంజూరు చేయడం కెనరాబ్యాంకు మేనేజర్ సీతారామయ్య చేసిన చర్యగా ఇందులో పొందుపర్చారు.
అసలు తనఖా పెట్టిన అస్తి గాని, రుణం కోసం దరఖాస్తు చేసిన సంస్ధ గాని, సంస్ధను నిర్వహించే సరిక వెంకటేశ్వరరావు గాని, టైటిల్ డీడ్స్ ఉన్న ఎం. శ్రీనివాస్ గాని ఎవరూ విశాఖ నివాసులు కాకపోవడాన్ని సీబీఐ గుర్తించింది. 2015 డిసెంబర్ 31న మొత్తం పది కోట్ల రూపాయిల రుణాన్ని మూడు పద్దులుగా ఈ సంస్ధకు మంజూరు చేశారు. ఇందులో మరో ఉల్లంఘనను కూడా సీబీఐ గుర్తించింది. ఈ రుణ పరిమితి వినియోగించుకోవాలంటే 30 లక్షల రూపాయిల ఫిక్స్ డ్ డిపాజిట్ అవసరమని నిబంధన చెబుతోంది. ఈమొత్తాన్ని తిరుమల సీఫుడ్స్ కరెంట్ అకౌంట్ నుంచి నైస్ మెరైన్ ఎక్ప్ పోర్ట్స్‌కు బదిలీ జరిగింది. ఓడీసీసీ అకౌంట్ నుంచి ఐదు కోట్ల రుణం మంజూరైన వెంటనే తిరిగి తిరుమల సీఫుడ్స్ కంపెనీ నుంచి బదిలీ అయిన 30 లక్షల రూపాయిలను తిరిగి ఆ కంపెనీకి పంపేసింది. ఈ మొత్తం కూడా బ్యాంకు మంజూరు చేసిన రుణం నుంచే సర్దుబాటు చేసినట్టయింది. ఇది నిబంధనలకు విరుద్దం. అప్పటి బ్యాంకు డీజీఎం భాస్కర్ ఫిక్స్డ్ డిపాజిట్‌ను మూసివేసేందుకు అనుమతించారని ఎఫ్ఐఆర్లో వివరించింది.
ఇందులో పలు ఉల్లంఘనలను సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పొందుపర్చింది. కంపెనీతో సంబంధం లేని వ్యక్తుల ఖాతాల నుంచి నిధులను మళ్లించినట్టు, రుణ పట్టికలు సమర్పించిన ప్రకారం ఓడీసీసీ ఖాతాలో కానరాకపోవడం వంటిని గుర్తించింది. 120 ఐపీసీ రెడ్ విత్ 420, 409 సెక్షన్లు, పీసీ యాక్ట్ 1988 ప్రకారం 13(2) రెడ్ విత్ 13(1)(డి) సెక్షన్ల ప్రకారం కూడా కేసును సరిక వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాస్‌ల సహా వెంకటేశ్వరరావు డైరక్టర్‌గా ఉన్న నైస్ మెరైన్ ఎక్స్ పోర్ట్స్ కాకినాడ సంస్ధపైనా, ఇంకా గుర్తించని కెనరా బ్యాంకు ఉద్యోగులను కూడా ఇందులో నిందితులుగా నమోదు చేసింది. విజయవాడలోని కెనరా బ్యాంకు డీజీఎం జీఎస్ రవి సుధాకర్ 2020 మే నెలలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ... ఈ ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. ఈ కేసు ఇన్స్పెక్టర్ బి.వెంకటరావు విచారిస్తారని, విశాఖ సీబీఐ ఎస్పీ పి.విమలాదిత్య ఎఫ్ఐఆర్లో వివరించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.21.31కోట్ల నష్టం
ముంబయిలోని 'నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్'(ఎన్.బి.హెచ్.సి.) సీఎండీతోసహా 15 మందిపై విశాఖ సీబీఐ అధికారులు శుక్రవారం కేసు నమోదుచేశారు. సీబీఐ ఎఫ్.ఐ.ఆర్.లోని వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడిలోని సూర్యశ్రీ కాజ్యు ప్రొడక్ట్స్ సంస్థ మేనేజింగ్ పార్ట్‌నర్ తేతలి సూర్యారెడ్డి, ఎన్.బి.హెచ్.సి. అధికారులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోని కొందరు గుర్తుతెలియని అధికారులు కుట్ర చేసి బ్యాంకును 21.31కోట్లకు మోసం చేశారని బ్యాంకు చీఫ్ మేనేజర్ సీబీఐకి ఫిర్యాదు చేశారు.
సూర్యశ్రీ సంస్థ ఇచ్చిన డబ్ల్యు.హెచ్.ఆర్.లను తాకట్టుపెట్టుకుని పంజాబ్ నేషనల్ బ్యాంకు 2011వ సంవత్సరం నుంచి మొత్తం రూ.20కోట్లు రుణం ఇచ్చింది. గోదాములోని సరకు విలువ ఆధారంగా బ్యాంకు రుణం ఇచ్చిన నేపథ్యంలో బ్యాంకు అధికారుల ఆదేశాలకు మేరకే ఎన్.బి.హెచ్.సి. అధికారులు సరకును గోదాము నుంచి బయటకు పంపడానికి అనుమతించాలి. అందుకు విరుద్ధంగా గోదాములోని జీడి పిక్కల స్థానంలో వాటి డొల్లలను మాత్రమే ఉంచి విలువైన సరకును ఖాళీ చేసినట్లు బ్యాంకు అధికారులు తేల్చారు. సరకు మొత్తం ఎన్.బి.హెచ్.సి. కస్టడీలో ఉన్న నేపథ్యంలో సరకు రహస్యంగా తరలిపోయిందంటే ఆ సంస్థ అధికారుల ప్రమేయం ఉందని బ్యాంకు అధికారులు నిర్ధరించారు. సూర్యశ్రీ సంస్థ వ్యాపార భాగస్వాములతో ఎన్.బి.హెచ్.సి.లోని అధికారులు కుమ్మక్కై సరకును మాయం చేసి డొల్లలను ఉంచినట్లు తేల్చారు. దీంతో సీబీఐ అధికారులు ఎన్.బి.హెచ్.సి. సంస్థ సీఎండీ విజయ్ కేల్కర్, ఎగ్జిక్యుటివ్ వైస్ ఛైర్మన్ అనిల్ కె.చౌదరి, ఎండీ-సీఈవో రమేశ్ దొరైస్వామి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్‌కుమార్‌సింగ్, రాష్ట్ర ఇన్‌ఛార్జి ఎ.సుబ్బారెడ్డి మరో నలుగురు అధికారులు, సూర్యశ్రీ సంస్థ వ్యాపార భాగస్వాములు తేతలి సూర్యారెడ్డి, తేతలి భద్రావతి, సంస్థ ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన తేతలి సుధాకర్‌రెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, మరికొందరు గుర్తుతెలియని బ్యాంకు అధికారులు, తదితరులపై కేసు నమోదు చేశారు. ఎన్.బి.హెచ్.సి. అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా, మోసపూరితంగా వ్యవహరించి అవినీతికి పాల్పడినట్లు సీబీఐ నిర్ధరించి సంస్థలోని కీలక అధికారులందరిపైనా కేసులు నమోదు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: