Arrest: నకిలీ తుపాకులు, కత్తిని చూపించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు రౌడీషీటర్లను.. విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆనందపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోకి చెందిన దోని సతీష్ అలియాస్ గసగసాలు (24), పెదజాలారిపేటకు చెందిన పి.గౌరీసాయి (24)లు రౌడీషీటర్లు. కొంతకాలంగా పరారీలో ఉన్న వీరు.. గంజాయి వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
వీరిద్దరికి సహాయకులుగా ఉన్న పాతనగరానికి చెందిన కె.శివ, వాసవానిపాలెంకు చెందిన వి.శ్రీను, కేరళకు చెందిన ఇబ్రహీంలను అదుపులోకి తీసుకుని వీరి నుంచి 25 కిలోల గంజాయి, ఆటో, ఆరు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. సతీష్, గౌరీ సాయిలు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు.
వీరు నకిలీ తుపాకులు, కత్తులను ఉపయోగించి, పలువురి వద్ద నుంచి బలవంతంగా ద్విచక్రవాహనాలను లాక్కొని, వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఆరు ద్విచక్రవాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. సతీష్ గతంలో పీడీ యాక్ట్ కింద అరెస్టై ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు.