విశాఖ జిల్లా పాడేరు మండలం మగతపాలెం వద్ద బొలేరో వాహనం బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా పెళ్లికుమారుడు మరణించాడు. మరో 15 మంది గాయాలపాలయ్యారు. వివాహ సారె వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
వివరాలు:
విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం కడుతుల నుంచి జి.మాడుగులలోని మగతపాలెంకు వివాహ సారె శుభకార్యానికి బొలేరో వాహనంలో 45 మంది వెళ్తున్నారు. మగతపాలెం ఘాట్ రోడ్లో బొలేరో వాహనం ఎదురుగా ఆటో రావడంతో డ్రైవర్ వాహనాన్ని మళ్లించే ప్రయత్నం చేశాడు. దీంతో బ్రేకులు విఫలమై వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఓ మహిళ మృత్యువాత పడింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో పెళ్లి కుమారుడు మరణించాడు. తన శుభకార్యానికి వస్తుండగా ప్రమాదంలో భర్త, పిన్ని చనిపోవడంతో పెళ్లి కుమార్తె రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
ఇదీ చదవండి: 'మావోయిస్టులు తీరు మార్చకుంటే గిరిజనుల చేతిలో చావు దెబ్బ తప్పదు'