విశాఖలో వాతావరణ శాస్త్ర అంశాలపై ట్రోప్మెట్-2019 సదస్సు ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును... భారత వాతావరణ విజ్ఞాన సొసైటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా వివిధ అనుబంధ విభాగాలతో కలిపి నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రాజీవన్ హాజరయ్యారు. సముద్రాలు, వాతావరణానికి మధ్య అనుసంధానంగా డబ్ల్యూఆర్ఎఫ్ మోడల్ సహాయంతో.. పర్యావరణ మార్పులు తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని రాజీవన్ తెలిపారు. గతం కన్నా మెరుగ్గా వాతావరణ స్థితిగతులను అంచనావేసి ముందుగా సమాచారం ఇవ్వగలుగుతున్నామన్నారు. దేశంలో మరిన్ని వాతావరణ నమోదు పరికరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. దీనివల్ల సూక్ష్మస్థాయిలో వాతావరణ వివరాల సేకరణకు వీలవుతుందన్నారు.
ఇదీ చూడండి: విశాఖలో ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్