విశాఖ జిల్లాలోని దుప్పిలవాడ పంచాయతీకి చెందిన గిరిజనులు తమకు ఆధార్ నమోదు చేయాలన్నా, ఫోన్ నంబరుతో అనుసంధానం చేయాలన్నా సుదూరం వెళ్లాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ నమోదు చేసుకోవాలంటే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ కొమ్ములవాడ గ్రామస్థులు రామారావు, సన్యాసిరావు, సత్యనారాయణ తదితరులు ఆధార్, ఫోన్ నంబరు అనుసంధానం కోసం చింతపల్లి తరలివచ్చారు. రోజంతా పనులు మానుకుని వచ్చామని.. తిరిగి వెళ్లేసరికి చీకటి పడుతుండటంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి చొరవతో పూర్తైంది..
కర్ఫ్యూ అమల్లో ఉండటంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందులకు గురయ్యామన్నారు. ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు చొరవతో త్వరితగతిన అధార్ అనుసంధానం పూర్తైందని బాధితులు పేర్కొన్నారు. మారుమూల గ్రామాలకు చెందిన గిరిజనులు ఆధార్ నమోదు, అనుసంధానం కోసం ఇబ్బందులు పడుతున్నారని గ్రామ వాలంటీర్ జగ్గారావు వివరించారు. ధారకొండ పంచాయతీ కేంద్రంలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తే.. చుట్టుపక్కల 4 పంచాయతీల పరిధిలోని 150 గ్రామాల గిరిజనులకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు ఐటీడీఏ అధికారులు చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి : Devineni: 'దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచేస్తున్నారు'