విశాఖలో చనిపోతున్న తాబేళ్లకు కారణం తెలిసింది. వలలు, మరపడవల ప్రొపెల్లర్ల వల్లే అవి చనిపోతున్నాయని విశాఖలోని సముద్ర అధ్యయన జాతీయ సంస్థ (ఎన్‌ఐఓ), సముద్ర మత్స్య పరిశోధన కేంద్ర సంస్థ తెలిపింది.
గత నెల విశాఖ శివారు అన్నవరం తీరం పరిసరాల్లో మొత్తం 12 కి.మీ.ల మేర శాస్త్రవేత్తలు పరిశీలించగా మొత్తం 63 తాబేళ్ల కళేబరాలు తీరంలో ఉన్నట్లు గుర్తించారు. వాటిలో 62 ఆలివ్‌రిడ్లే జాతికి చెందినవే కావడం గమనార్హం. మరోటి ఇతర సముద్ర జీవిదిగా గుర్తించారు. వాటి స్థితిని బట్టి అవి వివిధ సమయాల్లో మృతి చెందినట్లు నిర్ధరించారు.
- ఏటా లక్ష తాబేళ్ల రాక....
హిందూ మహాసముద్రం నుంచి ఏటా లక్షకు పైగా తాబేళ్లు సంతానోత్పత్తి కోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల మీదుగా ఒడిశా తీరానికి వెళ్తున్నాయి. ఒడిశా తీరాల్లోని ఇసుక తెన్నెల్లో ఇవి గుడ్లు పెడుతుంటాయి. కొద్దికాలానికి పిల్లలు తయారై క్రమంగా మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. నవంబరు నెల నుంచి సుమారు ఏప్రిల్ నెల వరకు ఈ ప్రక్రియ సాగుతోంది. అవి ప్రయాణించే సమయంలో మరపడవలు ఢీకొట్టి గాయాలపాలవడం, మరపడవల ప్రొపెల్లర్లు తగిలి మృత్యువాత పడి సముద్ర అలలకు తీరానికి కొట్టుకొస్తున్నట్లు గుర్తించారు.
- అధిక సంఖ్యలో మృత్యువాత..
విశాఖలో కేవలం 12 కి.మీ.ల తీరం పరిధిలోనే 62 తాబేళ్ల కళేబరాలు గుర్తిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 974 కి.మీ.ల తీరం పరిధిలో ఎన్ని తాబేళ్ల కళేబరాలుంటాయో. ఒడిశాతోపాటు ఏపీ తీరాల్లోనూ కొన్ని తాబేళ్లు గుడ్లు పెడుతుంటాయి. 2003వ సంవత్సరంలో చేసిన సర్వేలో సుమారు నాలుగువేల తాబేళ్లు ఏపీ తీరంలోని ఇసుకతెన్నెల్లో గుడ్లు పెట్టినట్లు తెలిసింది. 2001వ సంవత్సరంలో ఏపీ తీరం మొత్తం మీద సుమారు 806 ఆలివ్‌రిడ్లే తాబేళ్ల కళేబరాల్ని గుర్తించారు.
పరిస్థితి ఆందోళనకరమైనది కాదు...
సంతానోత్పత్తి కోసం లక్షకు పైగా తాబేళ్లు హిందూ మహాసముద్ర ప్రాంతం నుంచి ఒడిశా తీరం వైపు వెళ్తున్నాయి. వాటి ప్రయాణమార్గంలో కొన్ని అవాంతరాలు ఎదురుకావడం సహజం. ఆ క్రమంలో మృత్యువాత పడుతున్నాయి. వలలకు ‘టెడ్’ ఉపకరణం బిగిస్తే ఇవి సురక్షితంగా వలల నుంచి బయటకు వచ్చేస్తాయి. కానీ కొందరు ఆయా ఉపకరణాలు బిగించడం లేదు. కాలుష్యం కారణంగా మృతి చెందిన ఆనవాళ్లు మాత్రం లేవు. తాబేళ్లకు శవపరీక్షలు చేస్తే మరిన్ని కారణాలు వెలుగులోకి రావచ్ఛు అటవీశాఖాధికారులు ఆమేరకు చర్యలు తీసుకోవాలి.
-డాక్టర్ . జీపీఎస్. మూర్తి, ప్రధాన శాస్త్రవేత్త, ఎన్ఐఓ
ఇదీ చూడండి: నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యటకుల సందడి