Three Policemen Suspended for Dalit Youth Torture: విశాఖ జిల్లా పద్మనాభం పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు క్రైం పోలీసులు దళిత యువకుడిపై కర్కశంగా ప్రవర్తించారు. విచారణ పేరుతో దళిత యువకుడ్ని మద్యం మత్తులో పోలీసులు విచక్షణారహితంగా చితకబాదారు. లాఠీలతో ప్రతాపం చూపి కాలు విరగ్గొట్టారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలో (Padmanabham Police Station) ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
బాందేవుపురానికి చెందిన ఇందుకూరు రాజాబాబు తన షెడ్డులోని కోళ్లు దొంగతనానికి గురయ్యాయంటూ.. సెప్టెంబరు 29వ తేదీన పద్మనాభం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అదే గ్రామానికి చెందిన పాపునాయుడు, ఎర్నిబాబులను అనుమానితులుగా గుర్తించి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం విచారణ తర్వాత కేసును అదే స్టేషన్ పరిధిలోని క్రైం విభాగ పోలీసులకు అప్పగించారు. కోళ్ల దొంగతనానికి సంబంధించిన పంచాయితీ పెద్దల సమక్షంలో జరిగిందని.. చోరీ చేసింది తామే అంటూ ఇద్దరూ తప్పును ఒప్పుకున్నారు.
తంతే మీరే ఇస్తారంటూ..: పోలీసులు ఆదివారం రాత్రి వారిని అక్కడే ఉంచారు. ఈ సమయంలో కానిస్టేబుళ్లు కె.శ్రీను, కె.సతీష్ వారిని విచారించారు. తప్పు ఒప్పుకొన్నామని, రాజాబాబుతో రాజీ అయ్యామని పాపు, ఎర్నిబాబు పోలీసులకు తెలిపారు. అయితే తమకు చెరో 5 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలంటూ.. కానిస్టేబుళ్లు శ్రీను, సతీష్ డిమాండ్ చేసినట్లు ఘటన అనంతరం బాధితులు తెలిపారు. అంత తాము ఇచ్చుకోలేమని చెప్పగా.. తంతే మీరే ఇస్తారంటూ మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలు విరగ్గొట్టి.. గోడ దూకి పారిపోయిన కానిస్టేబుళ్లు: గతంలో రోడ్డు ప్రమాదంలో పాపునాయుడుకు కుడి విరగ్గా శస్త్రచికిత్స జరిగింది. అదే కాలుపై కానిస్టేబుళ్లు కొట్టారు (Dalit Youth Assaulted by Police in Visakha District). తట్టుకోలేక పాపునాయుడు, ఎర్నిబాబు పెద్దగా కేకలు వేయడంతో స్టేషన్ బయటఉన్న కుటుంబ సభ్యులు లోపలికి పరుగెత్తుకొచ్చారు. ఇది గమనించిన కానిస్టేబుళ్లు శ్రీను, సతీష్ గోడ దూకి పారిపోయారు. అనంతరం కాలు విరిగిన పాపునాయుడ్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థులు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.
Lady Constables Dragged Woman : మహిళపై లేడీ కానిస్టేబుళ్ల దారుణం.. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి..
పోలీసుల తీరుకు వ్యతిరేకంగా గ్రామస్థుల ఆందోళన: గత 4 రోజుల నుంచి విచారణ పేరుతో ఉదయాన్నే పోలీస్ స్టేషన్‌కు రప్పించి రాత్రి వరకు ఉంచేవారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీసీపీ గంధం నాగన్న, దిశ ఏసీబీ వివేకానంద హుటాహుటిన పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని విషయంపై ఆరా తీశారు.
కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు: బాధితుల ఫిర్యాదుతో ఈ ఘటనపై క్రైమ్ డీసీపీ నాగన్న దర్యాప్తు చేపట్టారు. పాపునాయుడు ఫిర్యాదు మేరకు శ్రీను, సతీష్ కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పద్మనాభం ఎస్సై మల్లేశ్వర్రావు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పండ్ చేస్తూ సీపీ రవిశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ సీఐ సన్యాసినాయుడికి ఛార్జి మెమో ఇచ్చారు.