Three Fishermen Returned From Pakistan After Four Years Jail : నాలుగున్నరేళ్ల క్రితం పాక్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కిన మత్స్యకారులు ఇప్పటికి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఇన్నేళ్లు పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవించి.. ఎట్టకేలకు తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరుకోవటంతో వారి ఆనందానికి అవధులు లేవు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 నవంబరు 18న గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ తీరంలో బాధితులు చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో వారి పడవ పాకిస్థాన్ బోర్డర్ జలాల్లోకి వెళ్లింది. దీంతో పాక్ కోస్టుగార్డ్ పోలీసులు వారిని అరెస్టు చేశారు.
వారిలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామానికి చెందిన మత్స్యకారుడు మైలపల్లి భాస్కర్‌రావు, తూర్పుగోదావరి జిల్లా గజ్జికాయలపురం గ్రామానికి చెందిన మాదే అన్నవరం, కోనసీమ జిల్లా ఐ.పోలవరం దరి పసుపులంక గ్రామానికి చెందిన పేమ్మిడి నారాయణరావు ఉన్నారు. వారికి అక్కడి భాష రాకపోవటంతో అధికారులు ఏం చెబుతున్నారో అర్థమయ్యేది కాదని, జైల్లో సరైన భోజనం కూడా పెట్టేవారు కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా నరకం అనుభవించి.. ఎట్టకేలకు దేవుడి దయతో బయటపడ్డామంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
పాక్ జైలు నుంచి విడుదలైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ మర పడవల ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి బాధితులకు ప్రభుత్వం ఒక్కొక్కరికీ 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించిందని ఆయన తెలిపారు. అదే తరహాలో వీరికి కూడా పరిహారం ఇవ్వాలని కోరారు. పాకిస్థాన్‌లోని కరాచీ జైలు నుంచి ఈ నెల 18న గుజరాత్‌కు చేరుకున్న మత్స్యకారులకు అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. వారు పూర్తిగా కోలుకున్న తర్వాత విశాఖ తీసుకుని వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
"2018 నవంబరు 18న మేము గుజరాత్ రాష్ట్రంలోని వీవవలి తీరంలో వేట సాగిస్తున్నాం. మా బోటు పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిందని పాక్ కోస్టుగార్డు పోలీసులు మమ్మల్ని అరెస్టు చేశారు. మమ్మల్లి పాక్ కోస్ట్ గార్డులు పట్టుకున్నవారిలో 23 మంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఉన్నారు. వీరిలో 22 మంది నాలుగేళ్ల క్రితమే విడుదలయ్యారు. వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేను ఒక్కడినే ఉండిపోయాను. దౌత్య సంప్రదింపుల తర్వాత ఇటీవల నాతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన ఇద్దరు మత్స్యకారులను కూడా పాక్ జైలు నుంచి విడుదల చేశారు. నేను అక్కడ ఉండగానే నా తండ్రి చనిపోయారు. రెండేళ్ల క్రితమే ఈ ఘటన జరిగినా కూడా నాకు ఈ విషయం తెలియలేదు. అక్కడ మాకు సరైన భోజనం కూడా పెట్టేవారు కాదు. అక్కడి జైళ్లు నరకానికి ఆనవాళ్లుగా ఉన్నాయి. ఇంకా మరికొంత మంది భారతీయ మత్స్యకారులు అక్కడి జైళ్లో మగ్గుతున్నారు."- భాస్కర్‌రావు, బాధితుడు
ఇవీ చదవండి