విశాఖ నగరంలో సంచలనం రేకెత్తించిన రౌడీషీటర్ కె.సాయికుమార్ (33) హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి ఎంవీపీ పోలీసు స్టేషన్లో సోమవారం ద్వారకా ఏసీపీ ఆర్.వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి వివరాలను వెల్లడించారు. అరిలోవ ప్రాంతానికి చెందిన కె.సాయికుమార్‌కు ఖాదర్ రియాజ్ (22), నమ్మి శ్రీనివాస్ అలియాస్ పండు(22), షేక్ సమీర్(24), ఓ 17 సంవత్సరాల బాలుడు స్నేహితులు. అతను చెప్పిన పనులను వీరు చేస్తుండటంతో వీరి మధ్య సన్నిహితం పెరిగింది. కొంతకాలంగా ఇతను మిగిలిన నలుగురిపై పెత్తనం చెలాయించటం, తరచూ గొడవలకు దిగటంతో వీరి మధ్య స్నేహబంధం చెడింది.
కొన్ని విషయాల్లో వారితో విభేదిస్తుండటంతో అతన్ని అడ్డు తొలగించాలని భావించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 26న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో సాయికుమార్ తన అత్త ఇంటి నుంచి మరో స్నేహితుడు రాంబాబుతో కలిసి ద్విచక్రవాహనం వెళ్తున్నట్లు సమాచారం రావటంతో ఖాదర్ రియాజ్, పండు, సమీర్, బాలుడు కలిసి రాడ్‌లు, కత్తులతో దారి కాశారు. టి.ఐ.సి. పాయింట్ వద్దకు చేరుకోగానే, అక్కడే మాటు వేసిన వీరు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. తలపై ఇనుపరాడ్‌తో రియాజ్, పండు బలంగా కొట్టగా, బాలుడు కత్తితో దాడి చేశారు. సాయితో పాటు ఉన్న స్నేహితుడు రాంబాబు కూడా గాయాలపాలయ్యాడు.
అతను తర్వాత తేరుకొని సాయి భార్యకు విషయాన్ని తెలిపాడు. వాళ్లు వచ్చి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుతో ఆరిలోవ సి.ఐ. ఇమానియల్‌రాజు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆధిపత్యపోరే హత్యకు కారణంగా భావిస్తున్నామని, హత్య చేసిన ముగ్గురిని అరెస్టు చేశామని, జువైనల్‌ను హోమ్‌కు తరలించినట్లు ఏసీపీ మూర్తి తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎంవీపీ సి.ఐ. రమణయ్య, అరిలోవ సి.ఐ. ఇమానియేల్‌రాజు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: