తెలుగువారికి సంక్రాంతి ముఖ్యమైన పండుగ. దూర ప్రాంతాల్లో వ్యాపారం, ఉద్యోగ నిమిత్తం ఉండే వాళ్లంతా... సంక్రాంతికి స్వస్థలానికి వస్తుంటారు. ఇందుకోసం వారు ఎంచుకునే ప్రధాన ప్రయాణ మార్గం రైలు. అందుకే 90 రోజుల ముందే రిజర్వేషన్లు తెరిచినా... వారంలోపే అన్నీ వెయింటింగ్ లిస్టులోకి వచ్చేస్తుంటాయి. అయితే కొవిడ్ కారణంగా ఈసారి కొన్ని ప్రత్యేక సర్వీసులు మాత్రమే తిప్పుతుండటం వల్ల... ఒక్కరోజుకే దాదాపుగా టిక్కెట్లన్నీ అయిపోయాయి.
భారీగా తగ్గిన ఆదాయం
విశాఖ నుంచి కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, దిల్లీ, ముంబై లాంటి నగరాల మధ్య రోజూ దాదాపు 112 రైళ్లు రాకపోకలు సాగించేవి. కొవిడ్ తర్వాత ప్రత్యేక రైళ్ల పేరిట 38 రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఇందులో దిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ ఏసీ ఎక్స్‌ప్రెస్, తిరుపతికి వెళ్లే రైలు మాత్రమే విశాఖ నుంచి నడుస్తున్నాయి. మిగిలినవన్నీ విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించేవే ఉన్నాయి. సాధారణ సమయంలో ఒకట్రెండు మినహా మిగిలిన వాటిలో పూర్తిస్థాయి బెర్తులు నిండటం లేదని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. ఆదాయం కూడా బాగా తగ్గిందని అధికారులు అంటున్నారు. ఒక్క వాల్తేర్ డివిజన్‌లోనే జులై నుంచి నవంబర్ వరకు గతేడాది 400 కోట్లు రూపాయలు ఆర్జిస్తే ఈ సారి 100 కోట్ల రూపాయలకు మించలేదని గణాంకాలు చెబుతున్నాయి.
అదనపు రైళ్లు ఉండవు
ఈ పరిస్థితుల్లో వచ్చే సంక్రాంతికి అదనపు రైళ్లు తిప్పాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. మరీ తప్పదనుకుంటే ఒకటి లేదా రెండు అదనపు సర్వీసులు నడిపే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇదీ చదవండి