రూ.80 కోట్ల వ్యయంతో విశాఖ జిల్లాలో నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద ఈ భారీ పథకం నిర్మాణం చేపట్టారు. దాదాపు 98 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు అధికారులు ప్రణాళికలు వేశారు. నీటి నిల్వలకు గాను నాతవరం మండలం శరభవరం సమీపంలో ఉన్న ఏలేరు కాలువ నుంచి పైపు లైన్ ద్వారా నీటిని తెప్పిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సంపుల ద్వారా గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు పైపు లైన్లు ఏర్పాటు.. పనులు పూర్తి కాలేదు.
8 గ్రామాలకు మాత్రమే తాగు నీరు..
నిధుల మంజూరులో జాప్యం కారణంగా కేవలం 8 గ్రామాలకు మాత్రమే తాగునీరు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 90 గ్రామాలకు పైలెట్ పథకం ద్వారా తాగునీరు సరఫరా కావటం లేదు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ఈ ఏడాది తాగునీటి ఎద్దడి గట్టెక్కే పరిస్థితి లేదని మూడు మండలాలకు చెందిన ప్రజలు వాపోతున్నారు. నక్కపల్లి, యస్ రాయవరం మండలాల్లో చాలా గ్రామాల్లో భూగర్భజలాలు చౌడు బారిపోవడంతో.. బోర్ల ద్వారా ఉప్పు నీరే లభిస్తోంది.
ఈ పథకం అందుబాటులోకి వస్తే పూర్తిస్థాయిలో తాగునీటి ఇబ్బందులు తీరుతాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పాలకులు, అధికారులు సమస్యపై దృష్టి సారించి.. మిగిలిన పనులు పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి..