విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో భూసేకరణకు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను పలు రాజకీయ పార్టీల నాయకులు, సమీప గ్రామాలకు చెందిన ప్రజలు వ్యతిరేకించారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో సుమారు 3 వేల 800 ఎకరాల్లో పారిశ్రామిక నడవ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రజాభిప్రాయం సేకరణ కార్యక్రమం చేపట్టారు. దీనికి విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షత వహించారు.
మూలపార, అమలాపురం, పాటిమీద, చందనాడ, బోయపాడు, బుచ్చిరాజుపాలెం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాలుష్యాలను వెదజల్లే పరిశ్రమలతో ఇప్పటికే తాము ఇబ్బందులు పడుతున్నామని రాజయ్యపేట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారని, దీన్ని తక్షణం నిలిపివేయాలని కోరారు. భూసేకరణలో భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి పరిహారం అందించాకే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇవీ చదవండి..