ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ విమర్శించారు. తమ ప్రాణాలు పోయే పరిస్థతి వస్తే ఎవరినైనా చంపేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన.. ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కోరారు. రాష్ట్రంలో హైకోర్టు తీర్పును లెక్కచేయడం లేదని.. అధికరణ 243కే ప్రకారం ఉద్యోగులు అందరూ ఎన్నికల సంఘాన్ని అనుసరించి పనిచేయాలని అన్నారు.
ఎన్నికల సంఘం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి కలెక్టర్లు హాజరుకాకపోవడాన్ని రాజ్యాంగ ఉల్లంఘనగా ఆయన అభివర్ణించారు. ఆర్టికల్ 329 ప్రకారం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అన్నారు.
రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు పరిచేందుకు రాష్ట్రపతికి నివేదించాలని కోరారు. ఇది జరగకుంటే ఎన్నికల్లో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యే ప్రమాదం ఉందని బీవీ రామ్ తెలిపారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని.. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైతే జగన్, మంత్రులు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.