Technology Fest at Warangal NIT: తెలంగాణ వరంగల్ నిట్‌లో సాంకేతిక ఫెస్ట్ 2022 పోటాపోటీగా సాగింది. దక్షిణ భారతంలో రెండోఅతిపెద్ద సాంకేతిక వేడుకలో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు, దేశవ్యాప్తంగా పేరొందిన కాలేజీల నుంచి మూడు వేలకు పైగా విద్యార్ధులు ఇందులో పాల్గొనడానికి విచ్చేశారు. ఇగ్నోసీ అంటే విజ్ఞానాన్ని ఆర్జించేందుకు తపన పడేవారన్న సందేశంతో వేడుక ప్రారంభమైంది. విద్యార్థులు తమ ఆలోచనలతో... నూతన ఆవిష్కరణలకు రూపకల్పన చేసి అదరహో అనిపించారు.
విద్యార్థుల ప్రతిభ: మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పి బాధ, మగవాళ్లకు ప్రత్యక్షంగా తెలియచేసేందుకు ఫీల్ ద పెయిన్, డేర్ టు ఫీల్ ద చెయిర్ పేరిట సిములేటర్ పరికరాన్ని విద్యార్థులు రూపొందించి అందరి దృష్టినీ ఆకర్షించారు. హ్యాకింగ్ నేరాలు, ఫోన్, ల్యాప్‌టాప్ నుంచి డేటా తస్కరించకుండా ఉండేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో నిర్వహించిన హ్యాక్‌షాప్, ఫార్ములా వన్ స్టూడెంట్‌కార్, మెదడుకు మేతపెట్టేలా ఆధారాలతో పజిల్ నింపడం, రేడియం క్రికెట్ మొదలైన ఈవెంట్లు అలరించాయి. పాఠశాల విద్యార్ధులు ఆ ఫెస్ట్‌లో పాల్గొని చెత్తఎత్తే రోబోలు, ప్రమాదాలు జరగకుండా రోడ్డు దాటేందుకు ఉపయోగపడే పరికరం తయారు చేసి ప్రతిభను చాటారు. ఈ సాంకేతిక ఉత్సవం విజ్ఞానంతోపాటు వినోదాన్నీ అందిస్తోందని ఇందులో పాల్గొనడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు.
కోటి రూపాయలు విరాళం: కళాశాలలో చదివి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న 1993-1997 బ్యాచ్ విద్యార్ధులు సిల్వర్ జుబ్లీ పురస్కరించుకొని ఒక్క చోట చేరి సందడి చేశారు. పాత స్నేహితులతో కలసి నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. వరంగల్ నిట్ విద్యార్ధులమని చెప్పుకోవడం గర్వంగా ఉందని కోటి రూపాయల విరాళాన్ని కళాశాలకు అందిస్తున్నామని పూర్వ విద్యార్థులు వెల్లడించారు. ఆదివారంతో వేడుకలు ముగియనున్నాయి. విజేతలుగా నిలిచినవారికి చివరి రోజు నగదు బహుమతి అందించనున్నారు.
ఇవీ చదవండి:
“లైఫ్ స్కిల్స్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్” పుస్తకాన్ని ఆవిష్కరించిన నారాయణ మూర్తి
నెల్లూరులో దారుణం.. వ్యక్తిపై డీజిల్ పోసి తగలబెట్టిన దుండగులు