TDP Leaders Meet Governor : చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో గవర్నర్‌ను కలిశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో పార్టీ ముఖ్య నాయకులు పలువులు గవర్నర్‌ను కలిశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, చిరంజీవిరావు, రామారావు, రాజబాబు, ఇతర నేతలు ఉన్నారు. ఇదిలా ఉండగా గవర్నర్ బస చేసిన విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ డీసీపీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో బందోబస్తు కొనసాగుతోంది.
రాష్ట్రంలో పరిణామాలను గమనిస్తున్నట్లు గవర్నర్ తెలిపారని ఆయనను కలిసిన టీడీపీ నేతలు వెల్లడించారు. తనకు కూడా తెలియకుండా అరెస్టు చేశారన్న గవర్నర్.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. రాజకీయ కక్షతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని గవర్నర్ వద్ద టీడీపీ నేతలు విన్నవించారు. నాలుగేళ్ల పాలనలో అవినీతి కనిపించలేదా.. ఇప్పుడే ఎందుకు తెలిసింది అని పేర్కొన్నారు. టీడీపీ ఇప్పటికిప్పుడు ఒంటరిగా పోటీ చేసినా 15 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేల్లో తేలిందన్న నాయకులు.. జనసేనతో కలిసి పోటీచేస్తే వైసీపీ చిరునామా గల్లంతవుతుందని సర్వేలు వెల్లడించాయని చెప్పారు. అధికార పార్టీ వైసీపీ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఐప్యాక్ సర్వేలో తేలినట్లు చెప్పారు.
యువగళం పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్న లోకేశ్ పాదయాత్రను అణచివేయాలని యత్నించారని గుర్తు చేస్తూ.. కావాలనే చంద్రబాబును జైలుకు పంపడం దారుణం అని తీవ్రంగా ఖండించారు. 48 గంటలపాటు రోడ్లపై తిప్పి సైకో ఆనందం పొందారన్న నేతలు.. తమ నేత చంద్రబాబు నాయుడు మనో ధైర్యాన్ని ఎప్పటికీ తొలగించలేరని స్పష్టం చేశారు. తెలుగు దేశం పార్టీకి సంక్షోభాలు కొత్తకాదని, తాజా పరిణామాలను అవకాశంగా మలుచుకుని ముందుకెళ్తాం అని ధీమా వ్యక్తం చేశారు. తప్పుడు ఆలోచన కలిగిన వ్యక్తులు ఉన్న ప్రభుత్వం ఇది.. చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారనే అనుమానం ఉందని అచ్చెన్న అన్నారు. చంద్రబాబును హౌస్ అరెస్టుకైనా అనుమతివ్వాలని కోర్టును కోరుతాం అని తెలిపారు.
మరో వైపు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. ఆయనతో పాటు నేతలు కళా వెంకట్రావు, కంభంపాటి రామ్మోహన్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏమిటనే అంశంపై జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో జనసేన బృందం గవర్నర్‌ను కలిసింది. పీతల మూర్తియాదవ్ నేతృత్వంలో గవర్నర్‌ను జనసేన నాయకులు పీవీఎస్‌ఎన్ రాజు, పంచకర్ల సందీప్, ఉషాకిరణ్, ఇతర నేతలు కలిశారు.