TDP Leaders Comments on YS Jagan: మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్ అని ఎవరైనా అంటే... వారికి బుద్ధి వచ్చేలా సరైన సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అన్నారు. తల్లి, చెల్లి కష్టాన్ని వాడుకుని ముఖ్యమంత్రి అయ్యాక వారిని వదిలేసిన జగన్ లాంటి బిడ్డ ఏ కుటుంబంలోనైనా ఉండాలనుకోరు అని పేర్కొన్నారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ తప్పుడు విధానాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో సంచులేసుకుని తిరిగే భజన బృందాన్ని చూశానని.. జగనన్నే మా భవిష్యత్ అనే స్టిక్కర్లు అంటిస్తున్నారని, 16 నెలలు చిప్పకూడు తిని, బెయిల్పై ఉన్న వ్యక్తి.. ఏపీ భవిష్యత్తా అని ప్రశ్నించారు. మద్య నిషేధం, సీపీఎస్ రద్దు, రైల్వేజోన్, ప్రత్యేక హోదా ఇవన్నీ మాట తప్పడం కాదా అని నిలదీశారు. ఏ తల్లయినా జగన్ లాంటి వాడిని కొడుకుగా కోరుకుంటారా అని ప్రశ్నించారు.
జగన్ రెడ్డి అరాచక పాలనకు ముగింపు దశ ప్రారంభమయ్యిందని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విమర్శించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై విమర్శలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు.
"మాట తప్పని మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి గారు.. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు క్రాస్ ఓట్లు పడితేనే గంటల వ్యవధిలో ఎవరు వేశారో అని కనిపెట్టేశారు. మరి అధికారం ఉండి, సీఐడీ పోలీసులు ఉండి, కేంద్ర ప్రభుత్వ నుంచి అండదండలు ఉంచుకొని.. మీ బాబాయి హత్య నిందితులు వీళ్లే అని సంగతి తెలిసిన తరువాత కూడా ఎందుకు అరెస్టు చేయించలేకపోయారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇలా ఇవన్నీ ఆలోచిస్తే ఒక పెద్ద చిట్టా అవుతుంది.. ఇతను మాట తప్పినవి, మడమ తిప్పినవి. అతని చెల్లి పాదయాత్ర చేసింది.. జగనన్న వదిలిన బాణాన్ని అని బయటకు వచ్చింది. కానీ జగన్ సీఎం కుర్చీలో కూర్చున్న తరువాత ఆ బాణం ఏమై పోయింది. బాణానికి తుప్పు పట్టిందా లేదంటే బాణం విరిగిపోయిందా. సొంత తల్లిని గౌరవించుకోలేని వాడు మిగతా తల్లులను ఎలా గౌరవిస్తాడు.. ఇది నేను ప్రజలను అడుగుతున్న ప్రశ్న". - వంగలపూడి అనిత, తెలుగు మహిళా అధ్యక్షురాలు
"ఏ రాష్ట్రం అయినా సుభిక్షంగా ఉండాలంటే.. ఆర్థిక పరిస్థితి బాగుండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పడేశారు. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుదేలు చేశారు. జగనన్న వచ్చిన తరువాత సంక్షేమం పేరుతో డబ్బులు పంచుతూ.. ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి తీసుకొనిరాకుండా యువత భవిష్యత్తును తాకట్టు పెట్టారు". - పల్లా శ్రీనివాస రావు, టీడీపీ నేత
ఇవీ చదవండి: