Ganta Srinivasa Rao comments: నాలుగేళ్ల క్రితమే భోగాపురం ఎయిర్ పోర్ట్, అదానీ డేటా సెంటర్లకు చంద్రబాబు శంఖుస్థాపన చేశారని.. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని వాటికే మళ్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం హయాంలో వచ్చిన హెచ్ఎస్బీసీ సంస్థ వైజాగ్ వదిలి వెళ్లిపోయిందని ఆవేదన చెందారు. టీడీపీ హయాంలో అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చామని.. కానీ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఒక్క ప్రతిష్ఠాత్మక పరిశ్రమ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన అనేక పరిశ్రమలను, ప్రాజెక్టును జగన్ మోహన్‌రెడ్డి వెళ్లగొట్టారని.. యువతకు ఉపాధి లేకుండా చేశారని అన్నారు. రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతున్న పరిశ్రమల యాజమాన్యాలను పిలిచి జగన్ ఎప్పుడూ మాట్లాడలేదని పేర్కొన్నారు.
ఒకటో తేదీన జీతం ఇవ్వలేరు, పెద్ద ఎత్తున్న పరిశ్రమలు తెస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో గతంలో చాలా విమాన సర్వీసులు ఉండేవి, ఇప్పుడు ఒకటి రెండు సర్వీసులు మిగిల్చారని విమర్శించారు. రొయ్యలు ఎగుమతి చేసుకోవడానికి రైతులు సిద్ధమైతే, విమానం లేకుండా చేశారని చెప్పారు. కేవలం అవినాష్ అరెస్ట్ నుంచి దృష్టి మరల్చడానికి అనేక జిమిక్కులు చేస్తున్నారని గంటా అన్నారు. సీఎం జగన్ విశాఖ పర్యటన కూడా ఇందులో భాగమేనని ఆరోపించారు.
రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకుండా అన్ని పార్టీలూ ఏకం కావాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు గంటా శ్రీనివాస్ తన మద్దతు తెలిపారు. వైసీపీని గద్దె దింపడానికి అన్ని పార్టీలు కలవాలి. అన్ని పార్టీలు కలిసే సమావేశాలు నిర్వహించాలని అన్నారు. కొద్ది రోజుల క్రితం సినీనటుడు రజనీకాంత్.. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర కోసం మాట్లాడారు. విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబును ప్రపంచం మొత్తం కొనియాడిందని అన్నారు. మళ్లీ చంద్రబాబు పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
"అంతర్జాతీయ విమానాశ్రయం, అదానీ డాటా సెంటర్ రెండూ కూడా శంకుస్థాపన జరిగాయి. మళ్లీ ఇప్పుడు జగన్ మోహన్‌రెడ్డి గారు చేస్తున్నారు. నాలుగేళ్ల తరువాత ఇప్పుడు హడావుడిగా భూమి పూజ చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. మరి ఈ నాలుగేళ్లలో విశాఖలో ఇంకేమైనా అభివృద్ధి పనులను ప్రారంభించారా? నాలుగేళ్లలో మెట్రో పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు". - గంటా శ్రీనివాసరావు, మాజీమంత్రి
ఇవీ చదవండి: