ఈఎస్‌ఐ కుంభకోణంలో మంత్రి, ఆయన కుమారుడు ఈశ్వర్‌తో ఏ14 నిందితుడు కార్తీక్ సన్నిహితంగా మెలిగిన కొన్ని ఫొటోలు, వీడియోలను తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రదర్శించారు. ‘కార్తీక్ ఎవరో తెలియదు. మా అబ్బాయికి లక్షల్లో అభిమానులుంటారు.. మావాడితో వాహనాలను ప్రారంభిస్తుంటారని కట్టుకథలు చెబుతున్నారు. కార్తీక్ ఎవరో తెలియకుంటే మంత్రి పక్కనే ఫొటోలు ఎందుకు దిగుతాడు? బెంజి కారు మంత్రి ఇంటి ముందే ఎందుకు ఉంటుంది? ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా వచ్చింది? మంత్రి కాన్వాయ్‌లో బెంజి కారును ఎవరు తిప్పుతున్నారు? ఫేస్‌బుక్‌లో గుమ్మనూరు యువసేన పేరుతో ఎందుకు పోస్టు చేశారు? అదే కారులో మంత్రి, ఆయన కుమారుడు ఎందుకు ఊరేగుతున్నారు?’ అని అయ్యన్న ప్రశ్నించారు. ‘ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రే ప్రకటించారు.
ఇంతకంటే ఆధారాలు కావాలా మంత్రిగారూ? ఇప్పుడు చేయండి రాజీనామా. నేనింతవరకూ ఏ మంత్రిపైనా అవినీతి ఆరోపణలు చేయలేదు. మిగతా వారిలా ఆధారాలు లేకుండా మాట్లాడను. కారు లంచంగా తీసుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ తమ పేరిట చేయించుకుంటే దొరికిపోతారనే ఇంకా కార్తీక్ పేరునే ఉన్న వాహనాన్ని నడుపుతున్నారు. ఈ అవినీతి వ్యవహారంపై ముఖ్యమంత్రి విచారణ జరిపించాలి. మంత్రివర్గం నుంచి జయరాంను తప్పించాలి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏ ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారు. ఇప్పుడిన్ని ఆధారాలు చూపుతున్నాం. మీ మంత్రిపై ఏ చర్యలు తీసుకుంటారోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు’ అని అయ్యన్న అన్నారు. గాలి జనార్దన్‌రెడ్డికి జయరాం బినామీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘మంత్రి అవినీతిపై మీరు చెప్పిన 14400కే ఫిర్యాదు చేశా. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోవచ్చు. మీ ఫిర్యాదు అందింది, చర్యలు తీసుకుంటామని కనీసం మెసేజ్ అయినా పంపించాలి కదా. మాజీ మంత్రిని నేను ఫిర్యాదు చేస్తేనే స్పందించడం లేదు. ఇక సామాన్యులు ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుంది? మీ ప్రకటనలకు, పనితీరుకు పొంతన లేకుండా పోయింది’ అని విమర్శించారు.
ఇదీ చదవండి: రేపటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు