విశాఖ జిల్లా చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలోని చెరకు తూనిక కేంద్రం రోడ్డులో రాష్ట్రస్థాయి ఎడ్లబళ్ల పోటీలు జరిగాయి. సోమవారం సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా చుక్కపల్లి, చెట్టుపల్లి వైకాపా కార్యకర్తలు సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున ఎడ్లబళ్లు పోటీలో పాల్గొన్నాయి. వాటిని తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. తూనిక కేంద్రం రోడ్డంతా జనసందోహంతో నిండిపోయింది.
ఈ పోటీలను స్థానిక వైకాపా నేతలు ప్రారంభించారు. విజయనగరం జిల్లా వల్లంపూడికి చెందిన సిద్ధి వినాయక బండి, తూర్పుగోదావరి జి.మెడపాడుకు చెందిన మాలిరెడ్డి సాయిరాజ్, అదే జిల్లా.. నాయకపల్లికి చెందిన గద్దె పావని ఎడ్లబళ్లు వరుసగా మొదటి, రెండవ, మూడవ బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలకు నిర్వాహకులు నగదు, సీల్డ్ బహుమతులు అందజేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఎంపీ విజయసాయి, మంత్రి అవంతి పోటాపోటీగా భూకబ్జాలు'