ఆన్లైన్ షాపింగ్ చేయటం ఇప్పుడు చాలా మందికి ఒక అలవాటుగా మారుతోంది. ప్రస్తుతం ప్రతి వస్తువును ఆన్లైన్లో కోనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. భారత్‌లో అధిక సంఖ్యలో ఈ సైట్లు అంతర్జాలంలో దర్శన మిస్తున్నాయి. కానీ కొన్ని మాత్రమే ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో అశ్రద్ధ వహించటం... సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది.
పొంచి ఉన్న అపాయం...
నకిలీ వెబ్ సైట్లు, ప్రముఖ వెబ్ సైట్లను పోలిన వాటిని సైబర్ నేరగాళ్లు సిద్దం చేసుకుంటున్నారు. ఇవి అన్ని సందర్భాలలో కన్పించ కుండా వారు జాగ్రత్త పడటంతో పాటు.., ఒక ట్రాన్షాక్షన్ అయిపోయిన వెంటనే సైటే మాయం అయ్యే విధంగా జాగ్రత్తలు వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కామర్స్ సైట్ల నుంచి దుస్తులు ఇతర గృహోపకరణాల కొనుగోళ్లు బాగా సాగుతున్నాయి. కొన్ని సందర్భాలలో వినియోగదారునికి నచ్చని సరకు బట్వాడా చేయటం(మార్పిడి చేయటం) , వాటిని మళ్లీ తిప్పి పంపడం వంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. నకిలీలను సృష్టించే హ్యాకర్లకు ఇవే పెట్టుబడిగా మారాయి. సైబర్ క్రైంస్టేషన్లకు వచ్చే ఫిర్యాదుల్లో వీరుచేసిన ట్రాన్సాక్షన్ తర్వాత మరో కొనుగోలు జరుగుతున్నవి వస్తున్నాయి. ఇందులో కొనుగోలు చెల్లింపుకోసం ఉపయోగించిన నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు తస్కరించి వినియోగదారునికి మెసేజ్‌లను పంపటం వంటివి చేస్తున్నారు. వీటి విషయంలో అప్రమత్తంగా లేనట్టయితే మాత్రం నష్టం భారీగానే చవి చూడాల్సి వస్తోందని పోలీసులు చెబుతున్నారు.
భద్రత ముఖ్యం సుమా...
దీనికోసం ప్రత్యేకంగా కొన్ని సూచలను పాటించాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ సెక్యూర్డ్ వెబ్ సైట్లలోనే షాపింగ్ చేయాలని నిర్దేశిస్తున్నారు. ఫిషింగ్ ఈమెయిల్స్- లింక్ లను తెరవడం వల్ల క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను తెలుసుకుని అకౌంట్ లో నగదును మోసపూరితంగా బదిలీ చేసే ప్రమాదం ఉంది. ఆన్లైన్ షాపింగ్ చేసే కంప్యూటర్లో యాంటీ వైరస్, యాటి స్పై వేర్, ఫైర్ వాల్ వంటి అధిక భద్రత ఉండేలా జాగ్రత్తపడాలన్నారు. సిస్టమ్ అప్డేట్గా, వెబ్ బ్రౌజర్ సెక్యూరిటీ కలిగి ఉండాలని తెలిపారు. షాపింగ్‌కి ముందుగానే సైట్ వివరాలన్నీ స్క్రీన్ షాట్లు తీసుకుని ఉంచుకోవాల్సిందేనని వివరించారు. అమ్మకం దారు చిరునామా, ఇతర వివరాలను తెలుసుకోవడమే మంచిదని వీరు చెబుతున్నారు. సైబర్ దాడి చేసే వారి నకిలీ వెబ్ సైట్లు కూడా కూడా అసలు వెబ్ సైట్లమాదిరిగానే చట్టబద్దమైనవిగానే కన్పిస్తాయి. వాస్తవానికి అవికావన్నది మోసపోయాక గాని తెలియటం లేదని అన్నారు . రివ్యూలను పరిశీలించాలన్నది ఒక ప్రధాన సూచన అని వివరించారు .
కొనుగోలు పూర్తయిన వెంటనే క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ లో ఛార్జీలను సరిచూసుకోవాలి. మీరుచెల్లించినది, స్టేట్ మెంట్ లో ఉన్నది వేర్వేరుగా ఉంటే వెంటనే సంబంధిత అధికారి దృష్టికి తీసుకురావాలి. దయచేసి మీ కొనుగోలు, చెల్లింపు, ఖాతా వివరాలను నిర్ధారించండి అని వచ్చే ఈ మెయిల్స్ కి ఎట్టి పరిస్ధితుల్లోనూ స్పందించవద్దన్నది మరో ప్రధాన సూచన. తేడాలుంటే అమ్మిన వ్యాపార సంస్ధ దృష్టికి తీసుకు రావడం తప్పనిసరి. లావాదేవీలు పూర్తయిన తర్వాత అన్ని వెబ్ బ్రౌజరు కుక్కీలను తొలగించి కంప్యూటర్ ను ఆపుచేయడం ఉత్తమం. స్పామర్లు, ఫిషర్లు ఏ కంప్యూటర్లు ఇంటర్నెట్ తో అనుసంధానించబడి ఉన్నాయో వాటిని హానికర సాఫ్ట్ వేర్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడం ఇప్పుడు జరుగుతున్నప్రక్రియగా పోలీసులు గుర్తించారు.
- బి. శ్రావణ్ కుమార్, ఏసీపీ, సైబర్ క్రైం, విశాఖ
సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్ సైట్లు సృష్టించి... దానిలో షాపింగ్ కోసం లాగిన్ కావాల్సిందిగా ఏకధాటిగా ఫోన్లకు మెసేజ్‌లు పంపడం వంటివి పరిపాటిగా మారింది. అలాగే మొసేజ్ ల ద్వారా వినియోగదారుడిని మోసగించటమే వీరి ప్రధాన లక్ష్యం. ఈ తరహ ఘటనలు అధికంగా ఉండటం పోలీసులకు ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 227 కొవిడ్ కేసులు, ఒకరు మృతి