తమ ఉనికిని చాటుకునేందుకు యాక్షన్ టీంలను రంగంలోకి దించి... భౌతిక దాడులు చేయడానికి మావోయిస్టులు యోచిస్తున్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. నిఘా వర్గాలు నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యాయి. తనిఖీలు ముమ్మరం చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఈ తరుణంలో మావోయిస్టుల కదలికలను కట్టడి చేసేందుకు ఏజెన్సీలోని 11 మండలాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి ఏజెన్సీకి వచ్చే ప్రతీ మార్గంలోనూ పోలీసులు వాహనాలను, వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. మరో పక్క ప్రత్యేక పోలీసు బలగాల బృందాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ... అనుమానితులను పరిశీలించే పని చేపట్టాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారిపై పోలీసులు నిఘా పెంచారు.
ఇటీవల గూడెంకొత్తవీధి మండలం సప్పర్ల వద్ద మావోయిస్టులు ఆర్‌టీసీ బస్సును ఆపి బస్సులో ఉన్నవారి గురించి ఆరాతీసినట్లు తెలిసింది. ఈ క్రమంలో అధికారులు రాత్రిపూట బస్సు సర్వీసులను మారుమూల ప్రాంతాలకు రద్దుచేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘాను ముమ్మరం చేశారు. విశాఖ మన్యం వ్యాప్తంగా సుమారు 50 బెటాలియన్లను రంగంలోకి దించినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ బాబూజీ ఆధ్వర్యంలో మన్యంలో పరిస్థితిని పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్, చింతపల్లి ఎఎస్పీ సతీష్‌కుమార్ సమీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: ఉన్నావ్: గుండెపోటు కాదు.. కాలిన గాయాలవల్లే మృతి!