పర్యాటక ప్రేమికులకు విశాఖ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఇక్కడి బీచ్‌లు. మరీ ముఖ్యంగా.. రుషికొండ బీచ్ అంటే కుర్రకారు ఎగిరి గంతేస్తారు. అందుకు కారణం.. ఇక్కడి ప్రకృతి రమణీయతతో పాటు ఇసుక తిన్నెల నుంచి అలల తాకిడిని చూస్తూ ఉంటే మనసుకు కలిగే ఆహ్లాదమే వేరు. ఇప్పుడు అదే అందాల రుషికొండ సాగర తీరం పర్యావరణహితంగా రూపుదిద్దుకుని.. అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. మన దేశం నుంచి బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ అందుకుని విదేశీ పర్యాటకాన్ని ఆహ్వానిస్తోంది. మన తీర ప్రాంతంలోని బీచ్‌కు అంతటి గౌరవం దక్కటంతో పర్యాటకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ప్రకృతి సొబగులను ఆస్వాదిస్తూ ప్రకృతి ప్రేమికులు పులకరించిపోతున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పర్యాటకులు సైతం రుషికొండ బీచ్ ను చూసి ఔరా అంటున్నారు. గోవా, మాల్దీవులను తలదన్నెలా ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం కలిగిన బీచ్‌ను ఇంకెక్కడా చూడలేదని మురిసిపోతున్నారు. ఈ సాగరతీరాన్ని ఇంతే పరిశుభ్రంగా ఉంచితే.. మరింత అభివృద్ధి చేయవచ్చని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: నేడు ప్రధాని మోదీ వారణాసి పర్యటన