విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ గండం నుంచి రక్షించుకోవాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని... ఏపీ సమగ్రాభివృద్ధి వేదిక అభిప్రాయపడింది. స్టీల్ ప్లాంట్ నష్టాల ఊబి నుంచి గట్టెక్కి ప్రైవేటీకరణ జరగకుండా ఉండేందుకు అవసరమైన సూచనలు... సలహాలపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, స్టీల్ ప్లాంట్ మాజీ సీఎండీ శివసాగర్ రావు పలువురు రాజకీయ నేతలు, విద్యావేత్తలు, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. ఉక్కు పరిశ్రమ యథాతథంగా కొనసాగటానికి సూచనలను చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనుల కేటాయింపు చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్మికులు నిబద్ధతతో పని చేయడం, ముడిసరకు కొనుగోలుకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని స్టీల్ ప్లాంట్ మాజీ సీఎండీ సూచించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం చాలా సున్నితమైనదని లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని కోరారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలని.. ఉద్యమాన్ని ముందుండి నడిపించాల్సిన ఆవశ్యకత ఉందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక తీర్మానానికి సీఎం హామీ'