విశాఖ ఏజెన్సీ దారాలమ్మ ఘాట్రోడ్లో దారి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని వారిపై దాడి చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. విశాఖ మన్యం గూడెం కొత్తవీధి మండల కేంద్రం నుంచి సీలేరు వరకు 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఘాట్ రోడ్డు అత్యంత ప్రమాదకరమైన అడవి ప్రాంతం గుండా వెళ్తోంది.
కొద్ది కాలంగా ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న పర్యాటక కార్లను కొందరు వ్యక్తులు అడ్డగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో సీలేరు నుంచి గూడెం కొత్తవీధికి వెళ్తున్న కారును.. దారాలమ్మ తల్లి ఆలయ రెండవ ఘాట్ రోడ్డు వద్ద బండరాళ్లను అడ్డుగా ఉంచి ఆగేలా చేశారు. రోడ్డుకు ఇరువైపుల అప్పటికే మాటు వేసుకొని ఉన్న దొంగలు ఒక్కసారిగా కారుపై దాడికి దిగారు. అందులో ఇద్దరు వ్యక్తుల వద్ద నాటు తుపాకీ కూడా ఉన్నాయని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు తెలిపారు. వారి వల్ల ముప్పు ఉందని గమనించిన కారులో ఉన్న వ్యక్తులు వేగంగా కారుని తిప్పుకొని వచ్చేసరికి విన్నప రాడ్లతో కారు అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ రోజు ఉదయం తెలంగాణా రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి అరకు వెళుతున్న కారును అడ్డగించి.. పోలీసులమని నమ్మించి కారును తనిఖీచేయాలని ఆపి నాటు తుపాకీలతో వారిని బెదిరించారు. ఈ ఘటనలో 35 వేలు నగదు, నాలుగు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో గంటలో సీలేరు నుంచి విశాఖ వెళుతున్న కారును కూడా పోలీసులమని చెప్పి తనిఖీ చేయాలంటూ వారి వద్ద నుంచి అయిదు తులాలు బంగారం దొంగిలించారు. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. పండుగకు వెళుతున్న వారు తమ ప్రయాణాలను వాయిదాలను వేసుకున్నారు. గడిచిన వారం రోజుల్లో అదే ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు మరో రెండు చోటు చేసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండీ.. : రవాణాశాఖ అధికారులు దాడులు .. పలు బస్సులపై కేసులు