ప్రముఖ రచయిత, అనువాదకుడు రామతీర్థ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. జూన్ 1న ఆంధ్రా వర్శిటీలో జరిగే కందుకూరి శతవర్థంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమైన రామతీర్థ గుండెపోటుతో కన్నుమూశారు. రామతీర్థ ఆకస్మిక మరణం రెండు తెలుగు రాష్ట్రాలలోని రచయితలు, సాహితీవేత్తలు, కవులను విషాదంలో ముంచివేసింది.
యాబులూరు సుందర రాంబాబు.. ఈ పేరు చాలామందికి కొత్తగా ఉండవచ్ఛు కానీ రామతీర్థ అంటే తెలియని సాహితీవేత్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఈయన గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో గుండెపోటుతో మరణించారు. ఈయనకు భార్య కామేశ్వరి, కుమారుడు క్రాంతికిరణ్, కుమార్తె కవిత ఉన్నారు. కుమారుడు హైదరాబాద్‌లో ఉంటుండగా.. కుమార్తె అమెరికాలో ఉన్నారు. భార్య కామేశ్వరి కుమారుని వద్ద హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈయన 1993లో రాసిన తెల్లమిరియ పుస్తకంతో సాహితీలోకంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్పటినుంచి ఈయన పలు రచనలు చేపట్టారు. విశాఖ సాహితికి పలు సేవలందించారు.
అరసం, విరసం సభ్యులు కానప్పటికీ వామపక్ష భావాలు కలిగిన రామతీర్ధ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య, సాన్నిహిత్యాన్ని తెలియని కవులు, రచయితలు లేరంటే అతిశయోక్తికాదు. ఈయన ప్రపంచ సాహిత్య చరిత్ర, రచనలు అన్నీ తెలిసిన విజ్ఞానిగా రచయితలు భావిస్తారు. ఈయన జగద్ధాత్రితో కలసి మొజాయిక్ సాహితీ సంస్థ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురు రచయితలను తాము నిర్వహిస్తున్న మొజాయిక్ సాహిత్య సంస్థ ద్వారా సత్కరించడం, కవితాగోష్టులు నిర్వహించడం వంటివి చేశారు. ఈయన మరణవార్త తెలిసి నగరంలో కవులు, రచయితలు, సాహితీ ప్రియులు కేర్ ఆసుపత్రికి చేరుకొని నివాళులు అర్పించారు. అమెరికాలో ఉన్న కుమార్తె శనివారం నాటికి చేరుకుంటారని.. చెబుతున్నారు. కుటింబీకులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది నిర్ణయిస్తారంటున్నారు. .
మండే మొజాయిక్..
మొజాయిక్ అనే సాహిత్య సంస్థను నెలకొల్పి మండే మొజాయిక్ పేరిట ప్రతీ సోమవారం సాహిత్య సమావేశాలు నిర్వహిస్తూ ప్రపంచ సాహిత్యాన్ని అందించే ప్రముఖ సాహితీవేత్తగా ప్రత్యేక ముద్రను చాటారు రామతీర్థ. స్వతహాగా వామపక్ష భావజాలాలను ఇష్టపడే రామతీర్థ వ్యాసం, కవిత్వం, అనువాదం ఏదైనా తనదైన మార్కుతో మొదటి పంక్తుల్లోనే సాహిత్యాభిమానుల్ని ఆకట్టుకునేవారు. సమకాలీన తెలుగు సాహిత్యరంగంలో క్రియాశీలంగా ఉండి పదునైన సాహిత్య విమర్శకులుగా పేరొందారు. గత ఏడాది ఏయూలో ప్రపంచ సాహితీ సదస్సులు నిర్వహించారు. ఆయనకు అనేక సాహితీ పురస్కారాలు లభించాయి.
ఇవీ చదవండి