ప్రభుత్వ కొలువు కోసం కష్టపడే వారికి చేయందిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తోంది విశాఖలోని పౌరగ్రంథాలయం. జీవితంపై కోటి ఆశలతో ప్రభుత్వ కొలువులు సాధించాలని వివిధ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు జ్ఞానాన్ని పంచే వేదికగా మారింది. వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్, గ్రూప్స్ పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా నామమాత్రపు ఫీజుతోనే ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థులు సహా సామాన్య పాఠకులు కూడా పుస్తకాలను కొద్ది రోజులు ఇంటికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించారు. నిత్యం సూమారు వెయ్యి మంది వరకు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు.
ఆన్లైన్ పరీక్షల సౌకర్యం కూడా
ఈ గ్రంథాలయం మొదటి అంతస్థులో పూర్తిగా ఎయిర్ కండీషన్డ్ గదులను ఏర్పాటు చేశారు. గ్రంథాలయంలో ప్రత్యేకంగా 41 కంప్యూటర్లు ఏర్పాటు చేసి.. ఆన్లైన్ లో పోటీ పరీక్షలు సాధన చేయిస్తున్నారు. అంతర్జాలంలో సమాచారం సేకరించడం ద్వారా విద్యార్థులు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ సమకాలీన అంశాలపై పట్టు సాధిస్తున్నారు.
ఇక్కడ చదువుకునే విద్యార్థుల్లో గత ఆరు నెలల కాలంలో 85 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొలువులను సంపాదించారు. తమకు శిక్షణనిచ్చిన గ్రంథాలయానికి రుణపడి ఉంటామని వారు అంటున్నారు. దాతల సాయంతో గ్రంథాలయాన్ని ఈ స్థాయిలో అభివృద్ధి చేశామని..స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆధునీకరణకు ఎంపీ నిధుల నుంచి 35లక్షల సాయం అందేలా కృషి చేస్తామనే హామీనిచ్చారని నిర్వహకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : మనసు 'దో(శ)చే' సావిత్రమ్మ టిఫిన్ సెంటర్