చోడవరానికి చెందిన రాములమ్మకు వృద్ధాప్య పింఛను వచ్చేది. ఉన్నట్టుండి ఆమె కుటుంబంలో ఆదాయపన్ను చెల్లించే వారు ఉన్నారని పింఛను ఆపేశారు. అప్పటి నుంచి మండల కార్యాలయం చుట్టూ తిరుగుతూ, ‘బాబూ.. నా కొడుకులు పెళ్లిళ్లు అయిన తరువాత వేరేగా వెళ్లిపోయారు. కార్డులు వేరు చేసుకున్నారు. ఇప్పుడు నా రేషన్‌కార్డులో నేను ఒక్కదాన్నే ఉన్నాను. పింఛను ఆపేస్తే నేనెలా బతికేది’ అంటూ ఆవేదన చెందుతోంది.
‘అనర్హుల జాబితాలో అర్హులున్నా వారికి ఇబ్బంది లేకుండా చూస్తాం. తగిన పత్రాలు చూపిస్తే వారి పింఛన్లకు ఢోకా ఉండదని’ డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఎందుకు పింఛను తొలగించింది తెలియజేస్తామన్నారు.
విశాఖ జిల్లాలో 4.84 లక్షల పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వీటికోసం ప్రతినెలా రూ.117 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రతినెలా కొత్త పింఛన్లు మంజూరు చేసే విధానం తీసుకువచ్చారు. అలాగే అందుకుంటున్న వారిలో అనర్హులుంటున్నారని ప్రతి నెలా కొంతమందిని పక్కన పెట్టేస్తున్నారు. మూడు నెలల క్రితం నిలిపేసిన 2,200 పింఛన్లలో ఇప్పటికీ 50 శాతం పునరుద్ధరణకు నోచుకోలేదు.
అలాగని వారంతా అనర్హులు కాదు. అధికారుల తప్పిదాలు, సాంకేతిక సమస్యల వల్ల కూడా అర్హులైన వారు బాధపడాల్సి వస్తోంది. ఈనెల ఏకంగా 22,583 మందిని అనర్హుల జాబితాల్లో చేర్చడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. నవశకం సర్వే లోపాలు తమ పాలిట శాపాలుగా మారుతున్నాయని పింఛన్‌దారులు వాపోతున్నారు. అర్హులుగా నిరూపించుకోవడానికి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
ఈ మూడు అంశాల ఆధారంగా..
పింఛన్ల అనర్హుల జాబితాలను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌లో పెట్టారు. రేషన్ కార్డు లేనివారు, ఒకే రేషన్ కార్డుల్లో ఇద్దరు లబ్ధిదారులున్నవారు, ఆధార్ కార్డులో వయసు మార్పుచేసిన వారి పింఛన్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ తరహా 22,583 పింఛన్లు ఉండగా అందులో రేషన్‌కార్డు లేని లబ్ధిదారులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. ఆధార్‌లో వయసు మార్చి లబ్ధి పొందేవారు సుమారు వెయ్యి మంది వరకు ఉంటారని అంచనా. ప్రస్తుతం గ్రామ/వార్డు సంక్షేమ సహాయకులు, వాలంటీర్లతో క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు.
ఆధార్ కార్డులో ఎన్నిసార్లు వయసు మార్చింది యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా తెలిసిపోతుంది. వయసు మార్చడానికి కారణం, అందుకు సమర్పించిన ధ్రువపత్రం సరైందో కాదో నిశితంగా పరిశీలించాలి. ఇటీవల రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులు మంజూరు చేశారు. ఆ కార్డులు లేనివారు కూడా పింఛన్లు పొందడానికి అనర్హులుగానే పరిగణిస్తున్నారు. అయితే చాలా వరకు ఆధార్ అనుసంధానంలో తప్పులు జరిగి భూములు, విద్యుత్తు కనెక్షన్లు లేకపోయినా ఉన్నట్లు చూపడం వల్ల కొంతమంది పింఛన్లు కోల్పోయే పరిస్థితి వస్తోంది.
ఇదీ చదవండి: మరి కొన్ని గంటల్లో.. పెను తుపానుగా బలపడనున్న నివర్!