తొలి 12 గంటలు యుద్ధ వాతావరణమే
ఈనెల 7న తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ట్యాంకు నుంచి స్టైరీన్ ఆవిరి లీకైనట్టు అధికారికంగానే ప్రకటించారు. ఏం జరుగుతోందో తెల్లారేవరకు అంచనా వేయలేకపోయినా.. ఆ తర్వాత గంటగంటకూ పరీక్షగానే మారింది. అదేరోజు ట్యాంకు వద్ద ఉష్ణోగ్రతల్ని తగ్గించాలని ప్రయత్నించినా అవి అదుపులోకి రాలేదు. ఆరోజు ఉదయానికి ఉష్ణోగ్రత 60 డిగ్రీలు. అప్పటికి పీటీబీసీ అందుబాటులో ఉంటే వేడి తగ్గేదని నిపుణులు భావించారు. అది లేకపోవడంతో గుజరాత్ నుంచి ఆరోజు అర్ధరాత్రి రప్పించారు. అప్పటికే ఉష్ణోగ్రత భారీగా పెరిగింది.
అందుకే ఖాళీ చేయించారా?
గత గురువారం రాత్రి 8 గంటలకు ట్యాంకు వద్ద ఉష్ణోగ్రత 150 డిగ్రీలకు చేరుకుంది. దాంతో ట్యాంకు సమీప ప్రాంతాలను ఖాళీ చేయించాలని మౌఖిక ఆదేశాలు వచ్చాయి. పోలీసులు మైకుల్లో చెప్పడంతో జనంలో కంగారు మొదలైంది. వేలాదిమంది రోడ్ల మీదకు వచ్చేశారు. గురువారం అర్ధరాత్రి దాటాక పీటీబీసీ వచ్చింది. ఓ పక్క ట్యాంకు ఉష్ణోగ్రతలు పెరగడంతో నిపుణులు పునరాలోచనలో పడ్డారు. 150 డిగ్రీల దగ్గర పీటీబీసీని ట్యాంకులో వేస్తే.. కొత్త ఆవిర్లు వచ్చి మళ్లీ ఏదైనా నష్టం కలిగించొచ్చని.. దాన్ని వినియోగించలేదు.
ఆ పదార్థాన్ని ఏం చేస్తారో?
ట్యాంకులో ఆవిర్లు రాగా మిగిలిన పదార్థం ముద్దగా మారుతోంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా అని అధికారులు ఆలోచనలో పడ్డారు.
* లీకేజీ వచ్చిన ట్యాంకు కాక.. మరో ట్యాంకులో 13 వేల టన్నుల స్టైరీన్ ఉంది. ఇదీ ప్రమాదానికి గురైతే పరిస్థితి ఏంటని అధికారులు ఎల్‌జీ పాలిమర్స్ యంత్రాంగాన్ని ప్రశ్నించారు. పరిశ్రమ యాజమాన్యం దాన్ని దక్షిణ కొరియాకు తరలిస్తోంది.
90% అదే ఆవిరైపోయింది
లీకైన ట్యాంకులో 2వేల టన్నుల స్టైరీన్ ఉండేది. అది పాలిమరైజేషన్‌కు గురికావడంతో వేడి పెరుగుతూ వచ్చింది. స్టైరీన్ ఉన్నంతసేపూ ఆవిర్లు పుడుతూనే ఉన్నాయి. వాటివల్ల లోపలున్న పదార్థం పాలిమరైజేషన్ చెందింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు సహజంగానే తగ్గాయి. ప్రస్తుతం ట్యాంకులోని స్టైరీన్ 90% దాకా ఆవిరైపోయింది. పరిస్థితి అదుపులో ఉందని, మరో మూడు, నాలుగు రోజుల్లో మరింత మెరుగవుతుందని నిపుణులు వెల్లడించారు.
ఇదీ చదవండి: అక్కడి గాలి పీలిస్తే.. ఏం కాదా? నీరు తాగితే?