అదో చరిత్ర కలిగిన వైద్యాలయం. సామాన్యుడికి మెరుగైన వైద్యం కావాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. విశాఖ కేజీహెచ్ అంటే తెలియని వారుండరు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి నిత్యం రోగులు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. అలాంటి ఈ ఆస్పత్రిలోని రోగులకు కొత్త సమస్య ఉత్పన్నమవుతోంది. కేజీహెచ్‌లో నడవలేని రోగులు అధికంగా ఉంటారు. వైద్యుల సూచనల మేరకు పరీక్షల నిమిత్తం ఒక చోట నుంచి మరోచోటుకు వెళ్లాలంటే కచ్చితంగా స్ట్రెక్చర్ లేదా వీల్‌ఛైర్ ఉండాల్సిందే. కానీ అవేవి ఆస్పత్రిలో కనిపించడంలేదు. వాటి సిబ్బంది కూడా ఉండటం లేదు.
పట్టించుకోని సిబ్బంది...
రోగుల అవస్థలు పరిశీలించి చూస్తే స్ట్రెక్చర్, వీల్ చైర్ సిబ్బంది పాత సామాన్లు మోసే పనిలో నిమగ్నమయ్యారు. మరో రెండు అడుగులు ముందు కేసి చూస్తే పెద్ద కుప్పలా పడి ఉన్న పాతసామాన్లను స్ట్రెక్చర్, వీల్ చైర్‌తో తరలిస్తూ కనిపించారు. మొదటగా రోగులకు సేవలు అందించి ...ఆ తర్వాత ఇటువంటి పనులకు వాటిని వినియోగిస్తే ఇబ్బందులు ఉండవు.. కానీ రోగులు ఇబ్బంది పడేలా కేజీహెచ్ సిబ్బంది చేస్తున్న పనులు చూస్తే రోగులే విస్తుపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగుల వెంట వచ్చినవారి సహాయంతోనే ముందడుగు వేస్తున్నారు. అధికారులు స్పందించి నడవలేని వారి కోసం ఏర్పాటు చేసిన స్ట్రెక్చర్ లేదా వీల్ చైర్లను వారి సేవలకోసం మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని రోగులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి...ప్రధాని మోదీ మెచ్చిన.. మన విశాఖ పరికరం