విశాఖ జిల్లా తురువోలు రోడ్డులో చీడికాడ ముఖద్వారం వద్ద పెద్ద చెరువు ఉంది. మండువేసవిలోనూ.. నిండు కుండను తలపిస్తోంది. ఈ చెరువు కోనాం జలాశయం ఆయకట్టు పరిధిలో ఉంది. జలాశయం నుంచి విడుదల చేస్తున్న నీటిని, వర్షాలు కురిసినప్పుడు వచ్చే నీటిని రైతులు సమష్టిగా చెరువులోకి మళ్లించుకుంటారు. ఆ నీటిని ఏడాది పొడవునా పొదుపుగా వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఎన్నో ప్రాంతాల్లో వేసవిలో నీటికోసం అల్లాడుతుంటే ఇక్కడ రైతులు మాత్రం ముందుచూపుతో చెరువులో నీటిని పొదుపు చేసుకున్నారు. వేసవిలో కూడా చెరువు దిగువ ఆయకట్టులో వరిసాగు చేశారు. కనుచూపు మేర పచ్చదనంతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా మారి.. మరో కోనసీమను తలపిస్తోంది. చెరువులో నీటిని పొదుపు చేసుకుని సాగుకు ఇబ్బందులు రాకుండా.. వరి పంట పండిస్తున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కనిగిరిలో కరిగిపోతున్న తెల్లరాయి.. పట్టించుకోని అధికారులు