Breakup Counselling: మీ ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి పాత ప్రేమికుడికి ఓకే చెప్పడం. రెండోది తనని మర్చిపోయి కొత్త అబ్బాయిని జీవితంలోకి ఆహ్వానించడం. మొదటి వ్యక్తిది ప్రేమ కాదు వ్యామోహం అనిపిస్తోంది. మీరు ప్రేమలో ఉన్నప్పుడే ఆ విషయం అర్థమై ఉంటుంది. ఇది మర్చిపోయి.. మంచీచెడులు గుర్తించకుండా జాలి హృదయంతో అతడివైపు మొగ్గు చూపడం సబబు కాదు. తను మీతో ప్రేమలో ఉంటూనే వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉండటం చూశానంటున్నారు.
ఇది అతడి స్వార్థాన్ని సూచిస్తోంది. ముందు బ్రేకప్ చెప్పి.. ఇప్పుడు మళ్లీ మీ వెంట పడటం అతడి నిలకడలేమికి నిదర్శనం. నువ్వు చెప్పినట్టే వింటాను అని అతడు మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాడు అంటున్నారు. దీన్ని సానుకూలంగా పరిశీలించేముందు అతడి మానసిక స్థితిని తెలుసుకోవాలి. ఎంతవరకు అతడు మాటపై నిలబడతాడో గమనించాలి.
పోనీ అతణ్ని నమ్మి ఒప్పుకుంటే.. భవిష్యత్తులో మళ్లీ పాత పాటే పాడడనే గ్యారెంటీ ఏంటి? అదే పరిస్థితి వస్తే మీరు మానసికంగా బాగా కుంగిపోతారు. మరోవైపు మీ ఇంట్లో వాళ్లు మీకు ఫారిన్ సంబంధం చూశారంటున్నారు. పెద్దవాళ్లు అన్నిరకాలుగా ఆలోచించి.. మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సంబంధం తెచ్చి ఉంటారు. తనతో మీ ప్రేమ సంగతి తెలియజెప్పండి. పాత ప్రేమికుడు భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి.
ఇలా చేయడం వల్ల మీలో మానసిక ధైర్యం పెరుగుతుంది. పైగా మీ నిజాయితీ తనకి నచ్చుతుంది. వచ్చే వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాడా? లేదా? అనేదీ తేలిపోతుంది. అన్నిరకాలుగా చూస్తే మీ పాత ప్రేమని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడమే మంచిదనిపిస్తోంది. ఆలస్యం చేయకుండా మీ బ్రేకప్ కథకి బ్రేకప్ చెప్పడమే మేలు.- టీఎస్ రావు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
ఇవీ చదవండి: