విశాఖ సింహాద్రి అప్పన్న దేవాలయంలో స్వామి వారి బంగారు ఆభరణాల పరిశీలనకు వచ్చిన దేవాదాయ శాఖ అధికారులు ప్రసాద్, శ్రీను.. తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి అలంకరించే బంగారు వడ్డాణం విరిగిపోయిన నేపథ్యంలో.. ఆలయంలోని ఆభరణాల అంశం చర్చనీయాంశమైంది. ఆ మేరకు భాజపా ధార్మిక సెల్ సభ్యుడు విజయశంకర్ ఫణీంద్ర గతంలో లోకాయుక్తకు దరఖాస్తు చేశారు. ఆ మేరకు ఆభరణాల లెక్కలు తేల్చాలని ఆదేశించిన మేరకు.. దేవాదాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
గతంలో ఇలాంటి తనిఖీలు 2010లో జరిగాయి. ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఆభరణాలు, వస్తువులను సరిపోల్చుతూ లెక్కలు తేల్చనున్నారు. బుధవారం జరిగిన తనిఖీల్లో ఆలయ అర్చకుల ఆధీనంలో ఉండే ఆభరణాలు, ఇతర వస్తులను పరిశీలించారు. ఇవి కాకుండా అధికారుల ఆధీనంలో ఉండే వాటిని కూడా పరిశీలించి వాస్తవాలను నివేదిస్తారు. ఈ తనిఖీలను దేవస్థానం అధికారులు గోప్యంగా ఉంచారు.
అధికారికంగా ఎలాంటి వివరాలు, సమాచారం బయటకు రానీయలేదు. తనిఖీలు జరిగే సమయంలో అధికారులను కలిసేందుకు ప్రయత్నించినా అనుమతించలేదని భాజపా ధార్మికసెల్ సభ్యుడు విజయ్‌శంకర్ ఫణీంద్ర ఆరోపించారు. అప్పన్న స్వామి ఆభరణాలలెక్కలపై అనుమానాలున్నాయన్నారు. అధికారులు క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించి వాస్తవాలను భక్త సమాజానికి వెల్లడించాలని డిమాండ్ చేశారు.