No Response to YCP Samajika Sadhikara Bus Yatra: సామాజిక సాధికార అనేది ఆచరణలో చూపితే.. మాటలు చెప్పాల్సిన పని ఉండదు. అయినా అధికార వైఎస్సార్సీపీ నాయకులు బస్సు యాత్ర చేపట్టి.. సామాజిక న్యాయం చేసేశామంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎస్సీ, ఎస్టీలకు అమల్లో ఉన్న 27 పథకాలను రద్దు చేసి.. ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించి.. మాటల్లో మాత్రం సామాజిక న్యాయం గురించి చెబుతుంటే ఎవరైనా పట్టించుకుంటారా.. అందుకే వైఎస్సార్సీపీ చేపట్టే సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. బస్సుయాత్రలు కాస్త తుస్సుమంటున్నాయి. వైసీపీ ఘనంగా సభల నిర్వహిస్తున్నా.. జనం లేక మంత్రులు, నేతలు కుర్చీలకే ప్రసంగాలు వినిపిస్తున్నారు. ఒంగోలు, విశాఖ దక్షిణ, బనగానపల్లె నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లోనూ ఇవే దృశ్యాలు దర్శనమిచ్చాయి. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిచోటా ప్రలోభపెట్టి, బెదిరించి ప్రజల్ని తరలిస్తున్నా.. వారు మధ్యలోనే వెనుదిరుగుతున్నారు.
ట్రాఫిక్‌ను ఆపేయడం, కుర్చీలు వేసేయడం - హంగామా తప్ప, కానరాని జనాలు- వెలవెలబోతున్న మంత్రుల యాత్రల సభలు
Ongole.. ఒంగోలులో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర, సభలో స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన మార్కును చూపించుకునేందుకు బల ప్రదర్శనకు దిగారు. సభకు పెద్ద ఎత్తున జనసమీకరణకు వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఒంగోలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దఎత్తునే తరలించారు. వీరిలో కొందరు మహిళలకు 300 రూపాయల చొప్పున డబ్బులిచ్చి మరీ తీసుకొచ్చారు. సభాప్రాంగణంలో 5 వేల మందికి కుర్చీలు వేశారు.
వైసీపీ 'సామాజిక తుస్సు యాత్ర' - ఫ్లెక్సీలు చించుకుని మరీ సభ నుంచి వెళ్లిపోయిన జనం
ప్రారంభ సమయంలో ఆ కుర్చీలు నిండాయి. గ్యాలరీకి రెండువైపులా చాలామంది నిల్చున్నారు. మరికొందరు సభ ప్రారంభానికి ముందు నిర్వహించిన ర్యాలీ ముగియగానే వెనుదిరిగారు. సభ ప్రారంభమయ్యాక బాలినేని ప్రసంగించగానే గ్యాలరీలకు ఇరువైపులా నిల్చొని ఉన్న మహిళల్లో చాలామంది వెళ్లిపోయారు. మరో 15 నిమిషాల తర్వాత చినుకులు రాలడంతో కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి. చినుకులే ఇబ్బందేమీ లేదని వేదికపై నుంచి నేతలు పదేపదే సర్దిచెప్పినప్పటికీ నిష్ఫలమే అయింది. వేదిక ముందున్న కుర్చీల్లోని వారు, అటూ ఇటూ దుకాణాల ముందున్నవారు మాత్రమే ఆగారు.
'రహదారి బంద్'గా మారిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికారత బస్సు యాత్ర
Visakhapatnam.. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సభకు.. డ్వాక్రా మహిళలను పెద్ద సంఖ్యలో తరలించారు. ఆ మహిళలంతా ఆధార్‌తో రావడమే కాదు.. సభాస్థలి వద్ద లొకేషన్ తెలిసేలా సెల్ఫీ తీసుకుని వారి సంఘం వాట్సప్ గ్రూపులో ఫొటోను అప్‌లోడ్ చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. వారి కోసం గ్యాలరీలనూ ఏర్పాటు చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిలో చాలా మంది మహిళలు సభాస్థలి వరకూ వచ్చి సెల్ఫీలు తీసుకుని తిరుగుపయనమయ్యారు. మంత్రులు వేదికపైకొచ్చి ప్రసంగించేటప్పటికి మొదటి గ్యాలరీ మాత్రమే.. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో నిండుగా ఉంది. రెండు, మూడో గ్యాలరీలు సగానికిపైగా, నాలుగో గ్యాలరీలో సగం మంది, 5, 6, 7 గ్యాలరీల్లో అక్కడక్కడ జనం ఉన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ప్రసంగిస్తున్నప్పుడు 4, 5, 6, 7 గ్యాలరీలు పూర్తిగా ఖాళీ అవ్వడంతో అక్కడి కుర్చీలను సర్ది రోడ్డు పక్కకు చేర్చారు.