ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చాలా మంది ప్లాస్మా కావాలని పోస్టులు పెడుతున్నారు. ప్రాథమిక దశలో ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలిస్తుందని పలువురు వైద్యులు సిఫార్సు చేయడంతో దీనికి తీవ్రమైన డిమాండు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో పలువురు కొవిడ్ బాధిత కుటుంబ సభ్యులు వైద్యుల లేఖలతో నగరంలోని రక్తం నిల్వ కేంద్రాలను సంప్రదిస్తున్నా నిల్వలు ఉండటం లేదు. నిత్యం సుమారు వంద మంది ప్లాస్మా కావాలని అడుగుతున్నట్లు సమాచారం. కనీసం పది యూనిట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఒక్క ఎన్‌టీఆర్ రక్త నిధికే రోజుకు 30 మంది వరకు వస్తున్నారు. ఈ కేంద్రంలో ఏప్రిల్ నెలలో ఏడు, మేలో ఇప్పటి వరకు అయిదు యూనిట్లే సిద్ధం చేశారంటే కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్ఛు అవగాహన లేక చాలా మంది ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావడం లేదు. కొవిడ్ నుంచి కోలుకున్న బాధితులు 28 రోజుల్లోగా, వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు 14 రోజుల తరువాత ప్లాస్మా దానం చేయొచ్చని ఎన్‌బీటీసీ (నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ కౌన్సిల్) మార్గదర్శకాలు ఉన్నాయి.
కొవిడ్ ఆసుపత్రులుగా మారడంతో..: నగరంలోని అత్యధిక ఆసుపత్రులు కొవిడ్-19 చికిత్స కేంద్రాలుగా మారాయి. దాదాపు ఎవరూ సాధారణ వైద్యం, శస్త్రచికిత్సలు చేయడం లేదు. గర్భిణిలు, క్యాన్సర్ రోగులు, కొన్ని అత్యవసర శస్త్ర చికిత్సలకు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం అవసరమవుతోంది. రక్తం అవసరమని ఘోషా, హోమీజేబాబా క్యాన్సర్ ఆసుపత్రి, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రుల నుంచి పలువురు రక్తనిధి కేంద్రాలకు వస్తున్నారు.
నెగిటివ్ గ్రూపులకు కొరత: గతంలో కన్నా ప్రస్తుతం రక్త నిల్వలు బాగా తగ్గిపోయాయి. రక్తదానానికి వాలంటీర్లు కూడా ముందుకురావడం లేదు. పాజిటివ్ గ్రూపుల రక్తం అందుబాటులో ఉంటున్నప్పటికీ నెగిటివ్ గ్రూపులు ఉండడం లేదు. ప్లాస్మా కోసం ఎక్కువ మంది వస్తున్నా దాతలు దొరకడం లేదు. దీంతో దాతలను తెచ్చుకోవాలని సూచిస్తున్నాం. కొవిడ్ నుంచి కోలుకున్న వారి వివరాలు అందిస్తే ఫోన్లు చేసి సేకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. - దుర్గాప్రసాద్, మేనేజింగ్ ట్రస్టీ , లయన్స్‌క్లబ్
ప్లాస్మా అడుగుతున్నారు: బ్లడ్ బ్యాంకుకు వచ్చే వారిలో ఎక్కువ మంది ప్లాస్మా కావాలని అడుగుతున్నారు. ప్లాస్మా దానంపై అవగాహన లేకపోవడం, చైతన్యకార్యక్రమాలు నిర్వహించకపోవడంతో ఎవరూ ముందుకురావడం లేదు. స్వచ్ఛందంగా దాతలు వస్తే నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవచ్ఛు తక్కువలో తక్కువగా పది యూనిట్లయినా నిల్వ చేసుకుంటే అత్యవసర పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకోవచ్ఛు కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలి. - ఆనంద్, ఎన్‌టీఆర్ రక్త నిధి కేంద్రం నిర్వాహకులు.
ఇదీ చదవండి..కొవిడ్ బారి నుంచి కోలుకున్నా.. వదలని దుష్ప్రభావాలు