ఏటీఎం దొంగలు..
తాజాగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన సమర్‌జ్యోత్‌సింగ్, కేరళ రాష్ట్రానికి చెందిన జాఫర్‌సాధిక్ విశాఖ వచ్చి కొన్ని రోజులపాటు ఓ హోటల్లో బస చేసి పక్కా ప్రణాళిక రచించి రెక్కీ వేసి ఏకంగా ఏటీఎంను దొంగిలించారు. గ్యాస్‌కట్టర్లు, సిలిండర్లు తదితరాలన్నింటినీ సమకూర్చుకున్నారు. నిందితుల వేలిముద్రలు, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు వారి ఆచూకీ కనుగొనడంతో కథ సుఖాంతం అయ్యింది. వీరు విమానంలో విశాఖ వచ్చి దొంగతనం అనంతరం తిరిగి విమానంలో వెళ్లిపోవడం గమనార్హం. వీరిపై నేరచరిత్ర ఉన్నప్పటికీ ఇటీవలే ఏటీఎంల చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీ కేంద్రంగా వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
చెడ్డీ గ్యాంగ్...
నిక్కర్లు వేసుకుని ఆముదం పూసుకుని రాత్రిపూట ఇళ్లలోకి వచ్చి దొంగతనాలు చేయడం చెడ్డీగ్యాంగు ప్రత్యేకత. చెడ్డీలు వేసుకుని వస్తుండడంతో వారికి చెడ్డీ గ్యాంగుగా పేరొచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్‌లోని దాహూద్ ప్రాంతానికి చెందిన వారు..చెడ్డీ గ్యాంగ్ సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. వారిలో కొందరు ఒక బృందంగా ఏర్పడి ఒక నగరాన్ని ఎంచుకుని... ఆ నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను తమ లక్ష్యంగా ఎంచుకుంటారు. చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్‌లో పలు దొంగతనాలకు పాల్పడడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పి.ఎం.పాలెంలోనే ఓ గేటెడ్ కమ్యూనిటీలోని నివాసాల్లో చెడ్డీగ్యాంగ్ సభ్యులు దొంగతనం చేశారు. ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండి ఇంట్లో కొద్దిపాటి వెండి సామగ్రి మాత్రమే ఉంచడంతో వాటినే దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీ టీవీ దృశ్యాల కారణంగా ఆ దొంగతనం వెలుగులోకి వచ్చింది.
రాంజీనగర్ ముఠా..
తమిళనాడులోని రాంజీనగర్ ప్రాంతానికి చెందిన కొందరు దొంగలు మనుషుల్ని మాటలతో మాయ చేసి ముంచేస్తుంటారు. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొచ్చేవారితో డబ్బులు కిందపడిపోయాయని, చొక్కాపై ఇంకు పడిందని చిన్నచిన్న కారణాలతోనే పలువురి దృష్టి మళ్లించి క్షణాల్లో వారిచేతిలోని బ్యాగులతో మాయమైపోతాయరు. వీరు తమిళనాడులోని రాంజీనగర్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గతంలో ఈ తరహా నేరాలు ఎక్కువ సంఖ్యలోనే చోటుచేసుకున్నప్పటికీ ఇటీవలికాలంలో మాత్రం వీరి కార్యకలాపాలకు బ్రేక్ పడింది.
బంగారం కొంటామని చెప్పి టోకరా.....
ఎక్కువ పరిమాణంలో బంగారం కొంటామని బేరాలాడి వారిని నమ్మకంగా ఒక ప్రాంతానికి పిలిపించి బంగారాన్ని దోచుకుపోయే ముఠాలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తిని మోసం నగరంలోని పి.ఎం.పాలెం ప్రాంతానికి పిలిపించి అతనిపై దాడి చేసి, బంధించి సుమారు మూడు కేజీల బంగారాన్ని దోచుకుపోయారు. వారిని రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లా డింగానా ప్రాంతానికి చెందిన దొంగలుగా గుర్తించారు. వారికి ఆ రాష్ట్రంలోని కొందరు రాజకీయ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. వారు దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన పోలీసులపై కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపిన విషయం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
హరియాణా, ఇరానీ ముఠాల గొలుసు దొంగతనాలు
హరియాణాకు చెందిన కొందరు యువకులు గొలుసు దొంగలుగా మారారు. వీరు బైకులు అద్దెకు తీసుకుని ఒకేరోజు ఐదారు దొంగతనాలు చేసి పారిపోతుంటారు. గుంతకల్లు, బివాండి ప్రాంతాలకు చెందిన కొందరు దొంగలు ముఠాలుగా ఏర్పడి గొలుసు దొంగతనాలకు పాల్పడుతుంటారు. వారిని ఇరానీ ముఠాలకు గుర్తించారు. వీరు కూడా ఒక నగరాన్ని ఎంచుకుని వరుస దొంగతనాలు చేసి పారిపోతుంటారు.
ఝార్ఖండ్ ముఠా..
ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కొందరు విశాఖ నగరంలో దొంగతనానికి పాల్పడ్డ దాఖలాలున్నాయి. బీచ్‌రోడ్డులో విక్రమ్‌ధమీజా అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేస్తే భారీగా సొమ్ములు దొరుకుతాయని భావించారు. అపార్ట్‌మెంట్లో విధులు నిర్వర్తించే ఉద్యోగే ఆ ముఠా సభ్యులను పిలిపించి దొంగతనం చేయించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ధమీజా తన ఇంట్లో పలు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో నిందితులు సునాయాసంగానే పట్టుబడిపోయారు. దొంగలను ప్రతిఘటించే క్రమంలో ధమీజా మృతిచెందిన విషయం నగరంలో సంచలనం సృష్టించింది.
బిహార్ ముఠా...
విశాఖ శివారు దారపాలెం ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆ దొంగతనం గుట్టురట్టు చేయడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. కొందరు అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టి ఉంచడంతో ఎట్టకేలకు ఆ దొంగతనం మిస్టరీ వీడింది. ఓస్థానికుడు, బిహార్ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని దొంగతనం చేయించినట్లు తేలింది.
ఉత్తరప్రదేశ్ ముఠా....
మాధవధార ప్రాంతానికి చెందిన ఓ నగల దుకాణం నుంచి కొందరు దొంగలు పెద్దఎత్తున నగలు దోచుకుపోయారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని తేలింది. నగరంలోని సీతమ్మధార ప్రాంతంలోని ఓ బ్యాంకు నుంచి ఓ వ్యక్తి రూ.12లక్షలు తీసుకువస్తుండగా అతని చేతిలో బ్యాగ్ లాక్కుపోయిన ఉదంతం జరిగింది. ఈ కేసులో నిందితుడు కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముర్తజాబాద్‌కు చెందినవాడిగా గుర్తించారు.
గోడాసహాని ముఠా....
సెల్‌ఫోన్ల దొంగతనాలు చేయడంలో నేపాల్ దేశ గోడా సహాని ప్రాంతానికి చెందిన కొందరు దొంగలు సుప్రసిద్ధులు. ముఖ్యంగా సెల్‌ఫోన్ దుకాణాలను లక్ష్యంగా చేసుకుని వీరు దొంగతనాలు చేస్తారని గుర్తించారు.
ముందస్తు జాగ్రత్తలు కీలకం.....
నగరంలోని పలు ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఉండడంతో పలువురు నేరస్థులు, దొంగలు పట్టుబడుతున్నారు. ఊరెళ్లేటప్పుడు పోలీసులు ఇచ్చే ఎల్.హెచ్.ఎం.ఎస్.(లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) నిఘా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: చంద్రబాబు