ఈ నెల 12న విశాఖ ఎంవీపీ కాలనీ సాయిబాబా ఆలయంలో చోరీకీ ప్రయత్నించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని విశాఖ శాంతిభద్రతల డీసీపీ-1 ఐశ్యర్య రస్తోగి వివరించారు. అర్ధరాత్రి సమయంలో ద్విచక్రవాహనంపై నిందితులు వచ్చినట్లు తెలిపారు. ఆలయం గోడ దూకి.. రాడ్డుతో హుండీ పగులగొడుతుండగా, అక్కడే ఉన్న వాచ్మెన్ వారిని పట్టుకునే ప్రయత్నం చేసినట్లు వివరించారు. అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో నిందితులు ద్విచక్ర వాహనాన్ని వదిలి పారియారని తెలిపారు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరా, వాచ్మెన్ చెప్పిన ఆధారాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
వాచ్మెన్ అప్రమత్తత వలనే ఆలయంలో చోరీని నియంత్రించగలిగి.. నిందితులను అరెస్టు చేయగలిగామని డీసీపీ తెలిపారు. అంతర్వేది ఘటనను దృష్టిలో పెట్టుకొని, నగరంలో అన్ని ఆలయాలంపై దృష్టి పెట్టామనీ... దొంగలు ఆలయాల వద్ద చేసే చేష్టల వలన మత విద్వేషాలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ప్రజలంతా సమన్వయం, అప్రమత్తతతో ఉండాలని కోరారు. ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, మసీదులు వద్ద సెక్యూరిటీతో పాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకోవాలని నిరసనలు