27 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని, మా సహనాన్ని పరీక్షించొద్దని.. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని.. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ(mrps president mandakrishna madiga).. ప్రధాని నరేంద్ర మోదీ(pm modi)ని కోరారు. ఎస్సీ వర్గీకరణపై పలు అంశాలను మంద కృష్ణ వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణను కోరుతూ ఢిల్లీలో ఈనెల 24వ తేదీన జాతీయ స్థాయి విద్యార్థుల మహాసభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని కేంద్ర న్యాయ శాఖ కృషితో ఏర్పాటు చేయాలి
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించకుంటే.. ఏడు లేదా తొమ్మిది మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని కేంద్ర న్యాయ శాఖ కృషితో ఏర్పాటు చేయాలని మందకృష్ణ మాదిగ సూచించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై 2004లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తీర్పు ఇచ్చిందని తెలిపారు. 2020లో పంజాబ్.. ఎస్సీ వర్గీకరణను అనుమతిస్తూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పిందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ వర్గీకరణకు సంబంధించి వెలువడిన తీర్పుతో తాము విభేదిస్తున్నామని అన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గతంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికారని మంద కృష్ణ తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రంలో కృషిచేయాలని కోరారు. ఉషా మెహ్రా కమీషన్‌ను ఏర్పాటు చేయడం, గద్వాల్, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికారని గుర్తుచేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయటం సరైంది కాదు
విశాఖ ఉక్కు కర్మాగారం విశాఖ ప్రజలతో పాటు,తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ అని, దీన్ని ప్రైవేట్ పరం చేయడం సరైన చర్య కాదని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం ఎంఆర్పీఎస్ తన వంతు కృషి చేస్తుందని అన్నారు.
ఇదీ చదవండి: Kodali nani: 'పవన్‌కు ధైర్యముంటే..ప్రధాని మోదీకి డెడ్‌లైన్ పెట్టాలి'