Vijaysai reddy: విశాఖ మధురవాడ ఐటీ హిల్స్ సమీపంలోని ఎన్‌సీసీ భూముల వ్యవహారానికి సంబంధించి.. తమపై తెదేపా నేతలతో పాటు కొన్ని పత్రికలు, ఛానళ్లు అసత్యప్రచారం చేస్తున్నాయని.. ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గండి బాబ్జీ తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పి.ఎం.పాలెం పోలీసు స్టేషన్లో ఏసీపీ శ్రీనివాసరావుకు శుక్రవారం సాయంత్రం ఆయన ఫిర్యాదు చేశారు. కొన్ని పత్రికలు, ఛానళ్లపైనా ఫిర్యాదు చేశారు.
అప్పుడే ఆ లావాదేవీలు..‘చంద్రబాబు అధికారంలో ఉండగానే ఎన్‌సీసీ భూముల లావాదేవీలు జరిగాయి. అప్పట్లోనే కోట్ల రూపాయలు తీసుకుని ఎన్‌సీసీ సంస్థకు లబ్ధి చేకూర్చింది చంద్రబాబు కాదా? తెదేపా అండతో ఆక్రమించిన ప్రభుత్వ భూములన్నీ స్వాధీనం చేసుకుంటాం. రెండున్నరేళ్ల వైకాపా పాలనలో ఎన్నో ఆక్రమణలను వెలుగులోకి తెచ్చాం’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
జరిగిందంతా చంద్రబాబు హయాంలోనే.. ‘వైకాపా ప్రభుత్వం ఎన్‌సీసీ సంస్థకు భూములు తక్కువ ధరకు అప్పగించిందని, వారిద్వారా విజయసాయిరెడ్డి కుటుంబానికి చెందిన జీఆర్‌పీఎల్ సంస్థకు రూ.200 కోట్లకు విక్రయించారని ఇటీవల తెదేపా నేతలు ఆరోపించారు. ఎన్‌సీసీ సంస్థ భూముల అభివృద్ధి ప్రాజెక్టును సొంతం చేసుకోగా, 2013లో ఆ కేటాయింపును రద్దుచేశారు. ఆ సంస్థ కోర్టుకు వెళ్లి స్టేటస్‌కో తెచ్చుకుంది.
2016లో ఆ సంస్థ తెదేపా ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ఒప్పందం ప్రకారం తాము డెవలప్‌మెంట్ రుసుము ప్రభుత్వానికి కట్టాలని, అది ఆమోదయోగ్యం కాకపోతే తాము గతంలో ప్రభుత్వానికి చెల్లించిన నగదును 12% వడ్డీతో వెనక్కి ఇవ్వాలని కోరింది. దాంతో చంద్రబాబు ఒప్పుకున్నారు. ఆయన హయాంలో కేబినెట్‌లో ఈ భూములను ఫ్రీహోల్డ్ ల్యాండ్‌గా మార్చింది. 2019 ఫిబ్రవరిలో 121 జీవో విడుదల చేú,‡ ఎన్‌సీసీ సంస్థ రిజిస్ట్రేషన్ అక్కర్లేకుండా జీపీఏ తీసుకోవచ్చన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.14 కోట్ల నష్టô వచ్చింది. ఇదంతా చంద్రబాబు చేసి ఇప్పుడు వైకాపా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు. మా కుటుంబ సభ్యులపైన, పార్టీపైన ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావాలు వేస్తా’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో తారాస్థాయికి చేరిన కరెంటు కష్టాలు.. మనకే ఎందుకీ కోత?