mp sujana chowdary fires on ysrcp: రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని.. ఇంత దారుణ పాలన ఎక్కడా లేదని.. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం 25 నుంచి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని.. రాష్ట్రాన్ని ఇప్పుడు కాపాడుకోకపోతే అందరూ వలసలు పోయే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. 30 నెలల పాలన ఎలా ఉందో ప్రజలు స్వయంగా చూశారని.. ఇప్పటికైనా తేరుకుని ఆలోచన చేయాలని పేర్కొన్నారు. వైకాపాలో ఉన్నవారు కూడా అభద్రతలో ఉన్నారని అన్నారు.
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వైకాపా పాలన సాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం హక్కుగా ఇచ్చేవాటితోపాటు హక్కుతో సంబంధం లేనివి కూడా ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేస్తే.. భాజపా ఎంపీలుగా తాము చేయాల్సింది చేస్తామని సుజనా చౌదరి అన్నారు. ప్రస్తుతమున్న 16 జోన్లతో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రాతిపదికన రైల్వే జోన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.
గతంలో రూ.250 కోట్లతో మొదలుపెట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టు కొనసాగనివ్వకుండా.. ఎమ్మార్వో నుంచి అనుమతిని ఇవ్వలేని దుస్ధితి ఏర్పడిందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం పాలసీ నిర్ణయం తీసుకుందని.. పార్టీ పరంగా ప్రజలకు అనుకూలంగా ఒక విధానంతో వెళుతున్నామన్నారు. అది నెరవేరాక ప్రజలకు తీపికబురు చెబుతామని.. అడగాల్సిన రీతిలో రాష్ట్ర ప్రయోజనాల గురించి వైకాపా అడగడంలేదని తెలిపారు. స్టీల్ ప్లాంట్ భూముల మదింపు విషయంలో ఆందోళన అనవసరమని.. స్విస్ ఛాలెంజ్ విధానంలో నష్టపోయే అవకాశం లేదని పేర్కొన్నారు. అనంతరం మాజీ ప్రధాని వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి:
Varla Ramaiah: సర్పంచ్‌ను ఆ విధంగా అవమానించటం దారుణం: వర్ల రామయ్య