వంశ పారంపర్య చైర్మన్గా ఉన్న వ్యక్తిని తొలగించడం దురదృష్టకరమని ఎంపీ రఘురామ కృష్టరాజు అన్నారు. స్త్రీ, పురుషులు సమానమే కానీ వంశ పారంపర్యంగా వస్తున్న ఆనవాయితీని తొలగించడం సరికాదని తెలిపారు. ఏ ఉద్దేశ్యంతో సంచయిత గజపతిరాజును తెరమీదకు తీసుకొచ్చారో..? సింహాచలం దేవస్థానంలో ఇప్పుడు జరగబోయే దోపిడీని ఆపాలని అన్నారు. గజపతిరాజు కుటుంబం 12 వేల ఎకరాల భూములు సింహాచలం దేవస్థానానికి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. దేవస్థానం ఆధీనంలో ఉండాల్సిన భూములు.. కొన్ని అన్యాక్రాంతం అయ్యాయి. సింహాచలం దేవుడు మాన్యాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. సింహాచలం దేవస్థానంలో పనిచేస్తున్న నిజాయితీగల అధికారి భ్రమరాంబ ఉద్యోగం చేయలేనంటూ వెళ్ళిపోయారన్నారు. కార్తిక్ అనే వ్యక్తిని ఓఎస్డీగా నియమించారని పేర్కొన్నారు.
"ప్రైవేటు నియామకాలు చేయడం దేవాలయ చట్టం ప్రకారం చెల్లదు. రూల్స్ కి వ్యతిరేకంగా రికార్డులు తెప్పించుకొని పరిశీలించడం జరిగింది. రాజధాని విశాఖపట్నంకు తరలిస్తున్న నేపథ్యంలో సింహాచలం భూముల్లో పెద్ద కుంభకోణం జరుగుతోంది. ఎంతోమంది హిరణ్యకశిపులు విశాఖకు వస్తున్నారు. విశాఖ వాసులరా నరసింహస్వామి ఆస్తులను కాపాడుకోవాలని శపథం చేయాలి. సింహాచలం భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అశోకగజపతి రాజును ఎలా తీసేస్తారు. మీ ఇష్టానికి మీరు తీసేస్తారా?? అశోకగజపతి రాజు చేసిన తప్పేంటి? అర్థరాత్రి జీవోలతో సంచయిత గజపతిరాజుని నియమించారు."-ఎంపీ రఘురామ కృష్టరాజు
కోర్టు అశోకగజపతిరాజు తిరిగి ఛైర్మన్గా నియమిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. మా ముఖ్యమంత్రికి తెలియకుండా కొంతమంది కుట్రలు చేస్తున్నారని వాపోయారు. రాజధాని మార్పు జరుగుతుందని తాను అనుకోవడంలేదన్న ఎంపీ... సింహాచలం, మాన్సాస్ ట్రస్టుకి ఒక చరిత్ర ఉందన్నారు. దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని.. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సంచయిత ను చైర్మన్గా నియమించారని తెలిపారు. సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకోకుండా ఆ కుటుంబానికే వదిలేస్తే మంచిదని హితవుపలికారు. అశోకగజపతి రాజును తొలగించి సంచయిత గజపతిరాజుని నియమిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఒక సర్వే చేస్తే ప్రజల మనోగతం ఏంటి అనేది తెలుస్తుందని సూచించారు.
ఇదీ చదవండి: పాఠశాలలో బాంబు కలకలం!