విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అనధికారికంగా నగదు బదిలీ లావాదేవీలు (హవాలా) జరిపేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన గ్రంధి నరసింహారావు అనే వ్యక్తి నిన్న రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బ్యాగులో నగదుతో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ వ్యక్తి హవాలా ద్వారా అనధికారికంగా నగదు లావాదేవీలను జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుంచి 50 లక్షల 38 వేల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌కి తరలించి కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ బంగారం వ్యాపారి వద్ద నరసింహారావు గుమస్తాగా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.