Comments on Andhra Pradesh capital city : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం మంత్రులకూ అంతుచిక్కడం లేదని తెలుస్తోంది. రోజుకో తీరుగా.. ఎవరికి వారు.. ప్రాంతం, సందర్భం, సమావేశాలకు అనుగుణంగా నిర్వచించడం ఇందుకు అద్దం పడుతోంది. అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించడం విదితమే. అప్పట్లోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. విశాఖపట్నం నగరాన్ని కార్యనిర్వహణ కేంద్రంగా, కర్నూలును న్యాయశాఖ కేంద్ర బిందువుగా, శాసనసభ పరంగా అమరావతిని రాజధానిగా ప్రకటించారు.
ఎవరికి వారు.. మూడు రాజధానులపై మంత్రులు తమ భాష్యాలను యధావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరికి నచ్చినట్టు వారు వివరణ ఇస్తూనే.. అది తీసుకునే వారిని బట్టి అర్థాలు ఉంటాయని చెబుతున్నారు. దీనిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ను విశాఖలో మీడియా వివరణ అడిగినపుడు స్పందించారు. ఇదే అంశంలో ప్రభుత్వం ఎప్పుడూ ఒకే మాట మీద ఉందని అన్నారు. చెప్పడంలో కొంత తేడాలు ఉన్నప్పటికీ.. అర్థం చేసుకునే వారిలో తేడాలను బట్టే వీటికి బహుళంగా పలు అంశాలు ప్రచారంలోకి వస్తున్నాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అన్న విషయంలో ఎటువంటి తేడా లేదన్నారు.
న్యూ క్యాపిటల్ అంటే.. విశాఖపట్నమే కదా. రాజధాని అనేది.. మనం చూసేదాన్ని బట్టి, అనుకునేదాని ఆధారంగా ఉంటుంది. విశాఖపట్నం కేంద్రంగానే పరిపాలన కొనసాగుతుంది. డీ సెంట్రలైజేషన్ ఆలోచన ఏంటంటే.. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం అనేది ప్రజలకు తెలియజేయాలన్నదే మా ఉద్దేశం. -గుడివాడ అమర్నాథ్, మంత్రి
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. త్వరలో మూడు రాజధానులు రాష్ట్రంలో ఏర్పాటవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ది హోల్ సేల్ దోపిడీ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు, తెదేపాను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం మానేశారని విమర్శించారు. చంద్రబాబు పని రాష్ట్రంలో అయిపోయిందని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. లోకేశ్ పాదయాత్రపై విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అదొక పాదయాత్ర, దానికోసం మేము స్పందించడం ఎందుకు.. అలాంటి పాదయాత్రల కోసం మమ్మల్ని అడుగుతారా అని బదులిచ్చారు.
ఇవీ చదవండి :