ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు భారత్లోకి ప్రవేశించింది. ఈ వైరస్ దరిచేరకుండా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రతతో పాటు మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు సైతం తక్కువ ధరకు మాస్కులు అందించేందుకు విశాఖ జిల్లా కె. కోటపాడు ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ ముందుకొచ్చింది. రోజుకు పదివేల మాస్కులు తయారు చేస్తూ... ఒక్కోటి రూ.10 విక్రయిస్తున్నారు.
మహిళలకు ఉపాధి...
ఈ సంస్థలో ఏడాది పొడవునా స్థానిక మహిళలకు ఉపాధి లభిస్తోంది. ప్రతిరోజూ వంద మంది వరకు పని చేస్తుంటారు. ఈ సంస్థను 2004లో డి.ఆర్.డి.ఎ ప్రారంభించింది. అప్పటి నుంచి మహిళలకు కుట్టు మిషన్ శిక్షణనిస్తూ ఉపాధి అందిస్తున్నారు. గతంలో 2011లో స్వైన్ ఫ్లూ వ్యాపించినప్పుడు వీరు మాస్కులను తయారుచేసి ప్రజలకు అందించారు. ఆ అనుభవంతో... ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు తయారీ చేపట్టారు.