అమాయక దళ సభ్యులను మానవ కవచాలుగా ఉపయోగించుకుని ఎన్కౌంటర్లలో సీనియర్లు తప్పించుకుంటున్నారని చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. గత కొన్ని ఎదురు కాల్పుల్లో సీనియర్ మావోయిస్టులు తప్పించుకోవడమే గమనార్హమన్నారు. పక్కా సమాచారంతోనే ఒడిశా, విశాఖ పోలీసు బలగాలు సంయుక్తంగా ఎన్కౌంటర్లో పాల్గొని ఒక మావోయిస్టును హతం చేశాయన్నారు.
మావోయిస్టులు హింస వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వ పరంగా లభించే పునరావాస పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతోనే ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో గాలింపు చర్యలు నిర్వహించామన్నారు. దిగజనబ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల వైపు నుంచి గాలింపు బలగాలు లక్ష్యం చేసుకుని కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం తమ బలగాలు కాల్పులు జరిపాయన్నారు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మరణించగా మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారన్నారు. ఈ కాల్పుల్లో ఎవరైనా గాయపడిన వారు లొంగిపోతే తక్షణం వైద్య సహాయం అందిస్తామని చింతపల్లి ఏఎస్పీ తెలిపారు.