పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో.. ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టులు ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ విధ్వంసాలు సృష్టించకుండా ఉండేందుకు గాలింపు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే గత నెల 26 ఏవోబీలో తోటగూడ అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో కిషోర్ అనే మావోయిస్టు మృతి చెందగా, మరో మావోయిస్టు పట్టుబడ్డాడు. తాజాగా.. వారోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో.. సరిహద్దుల్లో ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, అన్నవరం, చింతపల్లి, జీకే వీధి, సీలేరు పోలీస్‌స్టేషన్లను జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం చేసింది. అనుమానితులను సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
సీఆర్‌పీఎఫ్, ప్రత్యేక గ్రేహౌండ్స్ బలగాలను మోహరించి ఉదయం నుంచి సాయంత్రం వరకూ గస్తీ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. వారోత్సవాల నేపథ్యంలో.... ప్రజాప్రతినిధులను అధికారులు, గుత్తేదార్లు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీచేశారు. రహదారి పనులు చేస్తున్న వాహనాలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రామ్‌గుడా ఎన్‌కౌంటర్‌తో భారీ నష్టాన్ని చవిచూసిన మావోయిస్టులు డుంబ్రిగుడ మండలం లివిటుపుట్టు ఘటనతో దూకుడు పెంచారు. అదేవిధంగా పీఎల్‌జీఏ వారోత్సవాలు విజయవంతం చేయాలని ఏజెన్సీలో పలుప్రాంతాల్లో మావోయిస్టులు కర, గోడ పత్రాలతో పాటుగా బ్యానర్లు సైతం వేలాడదీశారు. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో... మారుమూల ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. ఈ సందర్భంగా సీలేరు పోలీసులు స్థానిక సరిహద్దు కూడళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఇదీ చదవండి: